Murder Mystery |హైదరాబాద్ సిటీబ్యూరో/తాండూరు, మే 18 (నమస్తే తెలంగాణ): అప్పులిచ్చిన వారిని అంతం చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారా నిందితులు. డబ్బులిస్తామని చెప్పి ఫామ్‌హౌస్‌కు పిలిపించి ఇద్దరిని అంతం చేశారు. మరో ఆరుగురిని సైతం అదేవిధంగా హత్య చేయాలని స్కెచ్ వేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు మహిళల మృతదేహాలను తాండూరు పోలీసులు ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఖాసీంపూర్కు చెందిన అబేదాబేగం స్థానిక అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నది. తాండూరు శివారులోని ఇందిరమ్మ కాలనీలో నివాసముండే మహబూబ్‌బీ బట్టలు అమ్మడం, ఇ తర చిరువ్యాపారాలు చేస్తున్నది. తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీమాబేగం, రెహమాన్ సహజీవనం చేస్తున్నారు. అబేదాబేగం వీళ్లకు దూరపు బంధువు. ఈ పరిచయంతో కరీమాబేగం జంట అబేదాబేగం దగ్గర రూ. 2 లక్షలు అప్పు తీసుకొన్నారు.
మహబూబ్‌బీ దగ్గర సైతం అప్పు చేశారు. నెలలు గడుస్తున్నా అప్పు తీర్చకపోవడంతో అబేదాబేగం, మహబూబ్‌బీ వారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మొయినాబాద్‌లో తమకు తెలిసిన వాళ్ల ఫామ్‌హౌస్ ఉన్నదని, అక్కడకు వస్తే డబ్బులు ఇచ్చేస్తామని కరీమాబేగం చెప్పింది. మార్చి నెలలో మహబూబ్‌బీ ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. అక్కడ కరీమాబేగం జంట, వీరి బంధువైన ఫామ్‌హౌస్‌లో పనిచేసే నయీంతో కలిసి మహబూబ్‌బీని హత్య చేశారు. అక్కడే పాతి పెట్టారు. మహబూబ్‌బీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అబేదాబేగంను సైతం ఇలానే ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేశారు. కుటుంబసభ్యులు బషీరాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.
కరీమాబేగం, రెహమాన్‌పై అనుమానం వచ్చి వా రిని విచారించారు. దీంతో నిందితులు వారిద్దరిని హత్య చేసిన విషయం బయటపడింది. కరీనాబేగం సుమారు 15 మంది దగ్గర అప్పులు చేసింది. అందులో 8 మంది దగ్గర ఎక్కువ మొత్తంలో తీసుకున్నది. ఇద్దరిని హత్య చేసిన తరువాత మరో మహిళను సైతం మొయినాబాద్‌కు రమ్మని సూచించగా, ఆమె పోలేదని దర్యాప్తులో తేలింది. సోమవారం మరో అయిదుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కూ డా మొయినాబాద్ వస్తే డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పిందని తెలిపారు. దీంతో వారిని హత్య చేయాలని స్కెచ్ వేసినట్లు నిర్థారణకు వచ్చారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.