రైతుబంధు ఎగ్గొట్టారు.. పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పుల పాలయ్యేలా చేశారు..
ప్రాజెక్టులను పడావు పెట్టారు.. సాగు నీళ్లివ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు..
సరిపడా ఎరువులు, విత్తనాలు ఇవ్వలేక.. చెప్పులు, పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే స్థితికి దిగజార్చారు..
పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేశారు.. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు..
ఇవన్నీ చాలవన్నట్టు.. రేవంత్ సర్కారు ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది..
వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించింది..
నాడు.. ‘తల తెగిపడినా మీటర్లు పెట్టనివ్వను’ అని గర్జించి.. రైతు ప్రయోజనాల కోసం రూ.25వేల కోట్లను కేసీఆర్ కాదనుకుంటే..
నేడు.. కేవలం రూ.6 వేల కోట్ల కోసం సీఎం రేవంత్ తలవంచారు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకున్నారు..
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడు రైతులు సాగుకోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. ఇప్పటికే రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వ్యవసాయ రంగానికి శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టాస్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)’లోకి తెలంగాణ డిస్కంలు ప్రవేశించనున్నాయి. ఈ స్కీంను రాష్ట్రంలో అమలుచేయనున్నట్టు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు తాజాగా సమాచారాన్నిచ్చాయి. ఇదే విషయాన్ని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున మంగళవారం ధ్రువీకరించారు. అంటే.. అతి త్వరలో రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు రాబోతున్నాయన్నమాట. మీటర్లు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 నుంచి చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ అడ్డంగా నిలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తున్నది.
ఆర్డీఎస్ఎస్ అనేది కేంద్రం అమలు చేస్తున్న పథకం. విద్యుత్తు సంస్కరణల పేరుతో 2021లో రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయానికి వినియోగిస్తున్న కరంటును మీటర్లు పెట్టి లెక్కించాల్సి ఉంటుంది. ఆ మీటర్లకు బిల్లులు తీసి వసూలు చేయాలి. ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్న రాష్ర్టాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా 0.5 శాతం రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇస్తుంది. అయితే, ఈ విద్యుత్తు సంస్కరణల వెనుక పెద్ద కుట్రదాగి ఉందని కేసీఆర్ గ్రహించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. ‘తల తెగిపడినా మీటర్లు పెట్టేది లేదు’ అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీటర్లు పెడితే రాష్ర్టానికి ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు సమీకరించుకునే అవకాశం ఉండేది. కానీ రైతుల ప్రయోజనాల కన్నా రూ.25 వేల కోట్లు ఎక్కువ కాదంటూ కేసీఆర్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఒక్క కేసీఆర్ మాత్రమే రైతుపక్షపాతిగా మోటార్లకు మీటర్లను వ్యతిరేకించారు. ఏకంగా పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ఇదే వాదలు వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒప్పుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్తును కొలిచేందుకు మీటర్లు పెట్టకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఓ సందర్భంలో చెప్పారు. మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని అందుకే తెలంగాణకు నిధులు ఇవ్వలేదని చెప్పారు.
నాడు కేసీఆర్ రైతు ప్రయోజనాల కోసం రూ.25 వేల కోట్లను కాదనుకోగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.6 వేల కోట్లకు ఆశపడి వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం ‘రీవ్యాంప్డ్ డిస్టిబ్యూషన్ సెక్టాస్ స్కీమ్’ (ఆర్డీఎస్ఎస్)ను 2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేస్తమని చెప్పింది. రూ. 3.03లక్షల కోట్లను ఇస్తామని రాష్ర్టాలకు ఆశచూపింది. అంటే, ఈ ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో చేరింతే ఈ సంవత్సరం మాత్రమే 0.5 శాతం అదనంగా నిధులు వస్తాయి. అంటే దాదాపు రూ. 6-7 వేల కోట్లు. విద్యుత్తు శాఖ ద్వారా అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 27,48,598 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దక్షిణ డిస్కం పరిధిలో 13,87,116 కనెక్షన్లు ఉండగా, ఉత్తర డిస్కం పరిధిలో 12,61,482 కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 90 శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. ఉచిత విద్యుత్తుతో ఈ రైతులంతా ధీమాగా బతుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 6-7 వేల కోట్లకు ఆశపడి వీరి బతుకులను ఆగం చేసేందుకు సిద్ధమైంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ క్రమంలో నెలకు రూ.10 వేల కోట్ల అప్పులు చేసింది. అప్పులు పరిమితులన్నీ దాటేసింది. ఫలితంగా ఇప్పుడు అప్పు పుట్టని పరిస్థితి తలెత్తింది. హెచ్‌సీయూ భూములు అమ్మేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నది. తనఖా పెట్టేందుకు ప్రైవేట్ బ్యాంకర్లను నమ్ముకొని జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నది. దీంతో రాష్ట్ర రోజువారీ నిర్వహణ కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రూ. 6-7 వేల కోట్లకు ఆశపడి వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా ఉరివేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఆర్డీఎస్ఎస్ స్కీంలో తొలుత ఫీడర్లకే మీటర్లు పెడతామంటారు. కానీ ఆ తర్వాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో రుజువైంది. ఈ వ్యవహారం చివరికి ఉచిత విద్యుత్తుకు ఎసరు పెడుతుందని, రైతులు బిల్లులు కట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘పండేటోనికి.. ఎరుక గూనివాటం. అన్నట్లు మన తెలంగాణ యవ్వారం. ఏంటో మనకు తెలుస్తది. మన రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నం. నువ్ కచ్చితంగా ప్రతి బావికి… ప్రతి మోటార్‌కు మీటర్లు పెట్టాలే. అని మోదీ అండదు. నా ప్రాణం పోయినా నేను పెట్టను అని చెప్పిన. అందుకు వాళ్లు ఒకటికాదు.. రెండు కాదు.. 25వేలకోట్ల రూపాయలు మనకు రాకుండా ఆపిండ్రు. వచ్చే బడ్జెట్ కట్ చేసిన్రు. ఇదే విషయాన్ని నిర్మల్ సీతారామన్ కూడా ఒప్పకున్నారు”
– కేసీఆర్
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది కిందటే ఒప్పుకున్నారు. నిరుడు జూలై 27న జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకున్నది. దీనికి సంబంధించి 2017లోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అందుకే ఇప్పుడు విధిలేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని చెప్పారు. తాము మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమని చెప్తూనే.. ఈ నెపాన్ని బీఆర్ఎస్పై మోపేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా నిరూపించారు. సభలో సీఎం చూపించినవి 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్ అని చెప్పారు. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెట్టాలని అందులో మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. ఈ నోట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం అందులో మార్పులు చేసిందని గుర్తుచేశారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలను 2021 జూన్ 9న కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ర్టాలకు పంపిందని వివరించారు. ‘ఈ పథకంలో చేరితే రాష్ర్టాలకు 0.5 శాతం అదనంగా అప్పు ఇస్తామని చెప్పారు. మేంచేరబోమని చెప్పాం’ అని స్పష్టం చేశారు. ‘మా మీద బురద జల్లే ప్రయత్నం చేసి, మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నరేమో అని అనుమానం కలుగుతున్నది’ అని గత జూలై 27న హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది తిరగకముందే ఆ అనుమానం నిజమైంది.