హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్నది. అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయని తెలిపింది.
గురువారం మెదక్ జిల్లాలో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.4 డిగ్రీలు నమోదైనట్టు ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 35.8, భద్రాద్రి కొత్తగూడెంలో 35.6, మహబూబ్నగర్ 35.5, నిజామాబాద్లో 35.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, మార్చి 2 తర్వాత ఎండలు క్రమంగా పెరుగుతాయని స్పష్టంచేశారు. గాలిలో తేమ తక్కువగా ఉండి, పగటిపూట ఉక్కపోత ఉంటుందని వెల్లడించారు.