హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 6 నుంచి 11వరకు ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 15జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది. ఈనెల 8,9 తేదీల్లో ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, నల్లగొండ, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాల కురుస్తున్న సమయంలో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ సూచించింది.