హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి తిరోగమనానికి వచ్చే రెండు, మూడురోజుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడు తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షాలు అకడకడ కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖ మ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అకడకడ మోస్తరు వర్షాలు కురిసినట్టు వివరించింది. సోమ,మంగళవారాల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాటులతోపాటు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల రాక!
ఈశాన్య రుతుపవనాలు ఈనెల17 నుంచి 20 వరకు మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందని వాతావరణశాఖ పేర్కొన్నది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపిస్తాయని వెల్లడించింది.1998, 2005,2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందిం చాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. 2లేదా 3తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వివ రించింది. ఇదిలా ఉండగా, ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి.