సుల్తాన్‌బజార్,జూన్ 24 : అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఓట్లకోసమే కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నయవంచనకు గురిచేసిందని విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజారాం యాదవ్ మండిపడ్డారు. విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల జేఏసీల నాయకులు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు.
రాజారాంయాదవ్ మాట్లాడుతూ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి గాలికొదిలేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని, నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితిలో ఆయన లేరని దుయ్యబట్టారు. తేదీలతో సహా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.
నిరుద్యోగులను మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా ఉద్యోగాల ఊసెత్తడం లేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముట్టడిలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్‌చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.