హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రూ.లక్షన్నర వరకు రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన వాట్సాప్ నంబర్ 83748 52619కు కేవలం 20 గంటల్లోనే దాదాపు 30 వేల ఫిర్యాదులు అందడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. రూ.లక్షన్నర మాఫీపై ప్రభుత్వం చెప్తున్నదానికీ, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులకు పొంతన లేదనడానికి ఈ ఫిర్యాదులే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమకు రుణమాఫీ కాలేదంటూ వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందజేస్తున్నారు. రుణమాఫీకి, రేషన్‌కార్డుతో సంబంధంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సహా మంత్రులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వస్తున్న ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి. చిన్న చిన్న సాంకేతిక అంశాలను చూపి తమకు రుణమాఫీ చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతాలో ఇంటిపేరు, అసలు పేరు, పేరు చివరన కుల ప్రస్తావన ఇలా అన్నీ మ్యాచ్ కావాలి… ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రుణమాఫీ చేసేది లేదన్నట్టుగా సర్కార్ వ్యవహరిస్తున్నది.
మాది జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. నాకు 2.20 ఎకరాల భూమి ఉన్నది. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌లో నా పేరు పెద్దిరాజుగౌడ్ అని ఉన్నది. బ్యాంకులో పెద్దిరాజు అని ఉన్నది. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రుణమాఫీ డబ్బులు ఇదే ఖాతాలో పడ్డాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆధార్‌కార్డులో ఉన్న పేరుకు బ్యాంకులో ఉన్న పేరు మ్యాచ్ కావడం లేదంటూ రుణమాఫీ చేయలేదు. నాకు రుణమాఫీ వచ్చేలా చూడండి
నాపేరు కల్వకోలు సురేందర్‌రెడ్డి. మాది కొంగరకలాన్. నాకు పంట రుణం రూ.లక్ష వరకే ఉన్నది. కానీ ఇంత వరకు మాఫీ కాలేదు.
నా పేరు ఆకుల దామోదర్. మాది వికారాబాద్ జిల్లా చౌడారం మండలం అడవివెంకటాపూర్ గ్రామం. నాకు క్రాప్‌లోన్ రూ. 54 వేలే ఉన్నది. ఇంకా మాఫీ కాలేదు.
మాది పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్. నాపేరు దరావత్ కిశోర్. బ్యాంకులో రూ.లక్షా 26 వేల అప్పు ఉన్నది. నాకు రేషన్‌కార్డు లేదని రుణమాఫీ కాలేదు.