హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, తమను పీఆర్సీలో భాగం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ప్రధాన కార్యాలయం ఎదుట పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో పనిచేస్తున్న రిసోర్సు పర్సన్లు (ఆర్పీ) శుక్రవారం మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 142 మున్సిపాలిటీల నుంచి పెద్ద సంఖ్యలోఆర్పీలు హాజరయ్యారు.
తమ డిమాండ్ల సాధన కోసం సీడీఎంఏ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆర్పీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నగరంలోని సైఫాబాద్, నాంపల్లి, యూసుఫ్‌గూడ, హైదర్‌గూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12 మంది అర్పీలను ముందస్తుగా అరెస్టు చేశారు. అంతకు ముందు రాత్రి ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ చేసి ధర్నాలో పాల్గొంటున్నారా? అని తమను అడిగారని వారు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు వారిండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడిచిపెట్టారని ఆర్పీలు తెలిపారు.