హుస్నాబాద్, సెప్టెంబర్ 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పార్టీ సీనియర్ నాయకుడు వెన్న రాజు ముఖానికి గాయాలై రక్తస్రావం అయ్యింది. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఒకరిపై ఒకరు కేసు పెట్టుకునేందుకు కూడా సిద్ధపడగా, కొందరు నేతలు వారించినట్టు సమాచారం. ఏఐసీసీ ప్రతినిధి మోహన్ ప్రకాశ్ ఎదుటే కార్యకర్తలు బాహాబాహీకి దిగడం విశేషం. ప్రవీణ్‌రెడ్డి టికెట్ ఆశించి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నుంచే పోటీ చేస్తానంటూ రావడంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. సోమవారం హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించగా, ఏఐసీసీ ప్రతినిధి, నియోజకవర్గ పరిశీలకుడు మోహన్ప్రకాశ్ హాజరయ్యారు. ర్యాలీలో ఒకవైపు ప్రవీణ్‌రెడ్డి వర్గం, మరోవైపు పొన్నం వర్గం పోటాపోటీగా నినాదాలు చేయడంతో గొడవ మొదలైంది. ఆవేశానికి గురైన కార్యకర్తలు తోపులాడుకోవడం, చేయి చేసుకోవడం జరిగింది. మోహన్ ప్రకాశ్‌తో పాటు పొన్నం, ప్రవీణ్‌రెడ్డి ఎదుటే కార్యకర్తలు కొట్టుకోవడంతో రెండు వర్గాల్లో విభేదాలు బయటపడ్డాయి.