పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో భాగమైన ఉద్దండాపూర్ కాల్వలపై లిఫ్టులు ఏర్పాటుచేసి కొడంగల్, నారాయణపేటకు నీళ్లిచ్చే ప్రతిపాదనలున్నా గతంలోనే ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి 4,350కోట్ల వ్యయంతో ఈ లిఫ్ట్ చేపడుతుండటంపై సాగునీటిరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు చేపడుతూ వేల కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల రాజీవ్‌భీమా ఆయకట్టుకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
MEIL | హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మేఘా కంపెనీకే దాదాపు ఖరారైనట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కంపెనీకి పనులను అప్పగించేందుకే ప్రాజెక్టులోకి ప్రెషర్ మెయిన్స్‌ను తీసుకొచ్చారని చెప్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా.. మేఘా సంస్థను ఈస్టిండియా కంపెనీతో పోల్చిన రేవంత్‌రెడ్డి సర్కారులో ఇప్పుడు అదే సంస్థకు పనులు దక్కుతుండటం గమనార్హం. ఇటీవల సుంకిశాల ఘటనలో రిటైనింగ్‌వాల్ కూలిన విషయం తెలిసిందే. ఈ పనులనూ మేఘా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అదే సంస్థకు భారీ ప్రాజెక్టును కట్టబెడుతున్నారనే వార్తలపై ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకుసాగుతుండటంపై ఇరిగేషన్ అధికారులు సైతం మండిపడుతున్నారు. అందుకు తాజాగా చేపట్టబోతున్న నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఉదాహరణగా నిలుస్తున్నదని వివరిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాలకు సాగునీటిని ఇచ్చే ప్రతిపాదనలున్నా కూడా వాటిని పక్కనపెట్టి రూ.4,350కోట్ల వ్యయంతో ఎన్కేఎల్ఐఎస్ను చేపట్టడంపై ఇరిగేషన్ అధికారులు, సాగునీటిరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును చేపడుతూ రూ.వేల కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్‌కేఎల్‌ఐఎస్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తంగా 2 ప్యాకేజీలుగా లిఫ్ట్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో పంచ్దేవ్పహాడ్ పంపింగ్ స్టేషన్, భూత్పూర్ పంపింగ్ స్టేషన్లతోపాటు, ఊట్కూరు, జయమ్మ, కానుకుర్తితోపాటు పలు చెరువుల అభివృద్ధి చేపట్టనున్నారు. అందుకు రూ.1,134.62 కోట్లు అవుతాయని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ఊట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు రూ.1,126.23 కోట్లు వ్యయాన్ని అంచనా వేశారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే రూ.2,260.85 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
ఇవిగాక 2వ దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్.. మొత్తంగా 7 చెరువుల నీటి నిల్వసామర్థ్యాన్ని పెంచడంతోపాటు, గ్రావిటీ కాల్వలు, ఆయకట్టు కు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మా ణం తదితర వాటికి మరో రూ.1,404.50 కోట్లు వ్యయమవుతుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. అయితే ఇటీవలే రెండు ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించింది. 24వ తేదీతో తుది గడువుగా నిర్ణయించింది. ఈ పనులు చేపట్టేందుకు దాదాపు రూ.3 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందివ్వాలని నిర్ణయించారు. మక్తల్ నియోజకవర్గంలో ఊటూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బోమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలను ప్రతిపాదించారు. దాంతో పాటు 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందివ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవానికి ఆయా ప్రాంతాలకు ఇప్పటికే చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీరివ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీరిచ్చేందుకు ప్రతిపాదలున్నాయి.
ప్రధాన కాల్వల తవ్వకానికి సైతం గత ప్రభుత్వం దాదాపు రూ.5,600 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా పిలిచింది. అదీగాక ఉద్దండాపూర్ కెనాల్‌పై అదనంగా పలుచోట్ల చిన్న చిన్న లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని ఎత్తయిన ప్రాంతాలకు సైతం నీటిని అందించాలని గతంలోని నిర్ణయించింది. అయినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. ప్రతిపాదనలన్నీ పక్కన పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్‌ను చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. నిధులు వృథా తప్ప మరేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల అటు రాజీవ్‌భీమా ఆయకట్టుకు సైతం తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఇంజినీర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రతిపాదనలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవే నిధులను ఉద్దండాపూర్ రిజర్వాయర్ కాల్వకు వెచ్చిస్తే లక్షల ఎకరాలకు నీరందే అవకాశముంటుందని చెప్తున్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతూ ఎన్‌కేఎల్‌ఐఎస్ చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) పనులకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో అప్పుడున్న భూగర్భ సొరంగాల స్థానంలో ఇప్పుడు ప్రెషర్మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం మేఘా కంపెనీకి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిపోతున్నది. ఈ నేపథ్యంలోనే కొడంగల్ లిఫ్ట్ పనులు మేఘా చేతికే వెళ్లనున్నాయని ఇరిగేషన్‌శాఖ అధికారులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని ఘంటాపథంగా చెప్తున్నారు. వాస్తవంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాల్సి ఉన్నది. దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాలి.
ప్రస్తుతం భూగర్భ సొరంగాలకు బదులుగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కటింగ్‌కు ఎకువ టైమ్ పడుతుందని ప్రభుత్వం చెప్తున్నది. రైతులకు సాగునీటిని సత్వరమే అందించేందుకు ప్రెషర్‌మెయిన్ నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుపుతున్నది. కానీ, ప్రభుత్వ వాదనలన్నీ ఒట్టివేనని ఇంజినీర్ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ప్రెషర్మెయిన్స్తో ప్రాజెక్టును చేపట్టినా దాదాపు 3 ఏండ్లు పడుతుందని ఇంజినీర్లు వివరిస్తున్నారు. మోటర్లు రావడానికి, పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటర్ల బిగింపునకు దాదాపు రెండున్నరేండ్లు పడుతుందని, ఆ సమయంలో ఇప్పుడున్న సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా భూగర్భ సొరంగాల తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని వెల్లడిస్తున్నారు.
సొరంగాల నిర్మాణం చేపడితే దీర్ఘకాలం పాటు ఎలాంటి మెయింటెనెన్స్ ఉండబోదని, ప్రెషర్స్మెయిన్స్తో అదనంగా మెయింటెనెన్స్ భారం కూడా పడుతుందని చెప్తున్నారు. సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్ పూర్తిచేయడానికి రూ.963.89 కోట్లు మాత్రమే అవసరమవుతాయని, ప్రెషర్మెయిన్స్ ద్వారా ఆ ఖర్చు రూ.1,016.57 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. మొత్తంగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా లిఫ్ట్‌ను చేపడితే ప్రాజెక్టు వ్యయం రూ.60 కోట్లు అదనంగా పెరగనున్నది. ఏటా మెయింటెనెన్స్ చార్జీలు అదనపు భారం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే సాకుతో ప్రెషర్మెయిన్స్ను చేపడుతున్నదని ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. అసలు వాస్తవం మాత్రం ప్రాజెక్టును మేఘాకు అప్పగించేందుకేనని స్పష్టంచేస్తున్నారు. కాంట్రాక్టర్టను బతికించడానికే తప్ప మరేమీ లేదని ఇంజినీర్ నిపుణులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.