హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం తలవంచింది. ఆరేండ్లుగా చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఏడు మెగా టెక్స్టైల్పార్కులను మంజూరు చేసింది. తెలంగాణకు ఒకటి కేటాయించింది. తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు ఒక్కొక్కటి చొప్పున మెగా టెక్స్‌టైల్‌పార్కు కింద నిధులను ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. వీటిని గ్రీన్‌ఫీల్డ్ మెగా టెక్స్‌టైల్‌పార్క్, బ్రౌన్‌ఫీల్డ్ మెగా టెక్స్టైల్పార్కులుగా విభజించారు. ఈ పథకంలో కేంద్రం 49 శాతం, రాష్ట్రం 51 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి విన్నవించగా, రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి, లేఖల ద్వారా మెగా టెక్స్‌టైల్‌పార్కును మంజూరు చేయాలని కోరారు.
అజంజాహీ స్థానంలో
వరంగల్‌లోని అజంజాహీ మిల్లు మూతపడటంతో ఆ జిల్లాలో మెగాటెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కిటెక్స్ కంపెనీ వరంగల్ మెగా టెక్స్‌టైల్‌పార్కులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఫైబర్ టు ఫ్యాషన్ విధానంలో ఏర్పాటు చేస్తున్నారు. పత్తితో వస్తే బట్టతో బయటికి వేళ్లే విధంగా అన్ని దశలకు సంబంధించిన పరిశ్రమలు అక్కడే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా టెక్స్‌టైల్‌పార్కు ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వలసలకు చెక్ పెడుతూ
తెలంగాణకు చెందిన వేలాది నేత కార్మికులు సూరత్, భీవండి, గాంధీనగర్, అహ్మదాబాద్, షోలాపూర్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. తెలంగాణ వచ్చాక వారందరిని వెనక్కి తీసుకరావటం, వలసలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో కేసీఆర్ మెగా టెక్స్‌టైల్‌పార్కుకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన ప్రజాప్రతినిధులను వివిధ రాష్ట్రాల్లోని టెక్స్టైల్ పరిశ్రమల అధ్యయనం కోసం పంపించారు. వాటికి ధీటుగా ఈ టెక్స్‌టైల్‌పార్కును తీర్చిదిద్దుతున్నారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్(సీఈటీపీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పార్కుకు ఏడాదికి 2వందల మెగావాట్లకు పైగా విద్యుత్తు అవసరం అవుతుంది. దీని కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. నీటి సరఫరాకు నిధులు మంజూరు చేశారు.