ఖలీల్‌వాడి, ఆగస్టు 29: యువత కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోని ప్రముఖ 41 ప్రైవేట్, మల్టీ నేషనల్ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చాయని, 3,500 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశాయని తెలిపారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. చిన్న చదువులు చదివిన యువతకు కూడా ఉద్యోగాలు వచ్చేలా కంపెనీలకు రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో నిర్వహించిన జాబ్‌మేళాలో కొన్ని కంపెనీలు ముందుకొచ్చి ముగ్గురు దివ్యాంగ అభ్యర్థులకు ఐటీ హబ్‌లో ఉద్యోగాలు కల్పించాయని గుర్తు చేశారు. ఐటీ హబ్‌లో మొత్తం 740 పోస్టులకు 331 పోస్టులను భర్తీ చేశామని, మిగతా ఉద్యోగాల కోసం నేటి జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వివరించారు. జాబ్‌మేళాకు ఆన్లైన్ ద్వారా 8 వేల మంది, ఆఫ్‌లైన్ ద్వారా 6 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. కష్టపడి చదివిన వారికి కచ్చితంగా జాబ్ వస్తుందని ప్రోత్సహించారు.
నిజామాబాద్ జిల్లా యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు తరలివచ్చిన ప్రముఖ కంపెనీలకు, జాబ్‌మేళాను నిర్వహించిన టాస్క్ ప్రతినిధులకు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉద్యోగాల ఎంపిక ప్రక్రి య కొనసాగగా.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో విద్యార్హతలు కలిగి ఉన్న యువతీయువకులు జాబ్‌మేళాకు హాజరయ్యారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. ఉద్యోగం రానివారు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఈ మేళాలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.