KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజనులను అన్నిరంగాల్లో నిలబెట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా కృషిచేసిందని, బడుగుల కోసం నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా కులవృత్తులను కేసీఆర్ ప్రోత్సహించారని, మార్కెట్ కమిటీలు మొదలు చివరకు మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో గడిచిన పదేండ్లలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు ప్రాధాన్యం ఇచ్చి, వారి రాజకీయ ఎదుగుదులకు పాటుపడ్డారని చెప్పారు.
శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న కేటీఆర్, మల్లంపేట సమీపంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడ అందుబాటులో ఉన్న బీసీ నేతలతో మాట్లాడారు. నాడైనా నేడైనా భవిష్యత్తులో అయినా బలహీనవర్గాలకు బలమైన గొంతుక బీఆర్ఎస్సేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ చెప్పారు. బీసీలకు న్యాయం చేసే దిశగా 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైన రాజ్యాంగసవరణ కోసం పోరాడుతామని తెలిపారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొడుతున్నదని, కులగణన పేరుతో కుతంత్రాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. శాసనసభలో బీసీ కులగణనపై కేవలం స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చి బీసీ రిజర్వేషన్లు చేసినట్టు డబ్బా కొట్టుకుంటున్నదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కులగణను మాత్రమే చేసిందని, అదీ తప్పులతడకగా ఉన్నదని కేటీఆర్ సోదాహరంగా వివరించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా రాష్ట్రంలో కేవలం బీసీ జనాభా మాత్రమే ఎందుకు తగ్గిందని అనుమానం వ్యక్తంచేశారు. బీసీ జనాభా 5 శాతం మేరకు తగ్గినట్టు చూపించారని, అంటే ప్రభుత్వం 22 లక్షల మందిని మాయం చేసినట్టు అని వివరించారు. బీసీలపై ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీసీల జనాభా తగ్గించి వారికి ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఫలాలను ఎగ్గొట్టవచ్చని రేవంత్రెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కులగణన చేపట్టలేదని, ఏదో మొక్కబడిగా నిర్వహించిందని, తమిళనాడు వెళ్లి పరిశీలించి వచ్చిన వాళ్లు అక్కడ చేసినట్టు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని కేటీఆర్ గుర్తుచేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా కులవృత్తులను ప్రోత్సహించారని, మార్కెట్ కమిటీలు మొదలు చివరకు మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. తెలంగాణలో గడిచిన పదేండ్లలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి, వారి రాజకీయ ఎదుగుదులకు బీఆర్ఎస్ పాటుపడిందని గుర్తుచేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజనులను అన్నిరంగాల్లో నిలబెట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా కృషిచేసిందని, బడుగుల కోసం నిలుస్తుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ బలం, బలగం సబ్బండవర్గాలేనని పునరుద్ఘాటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేద్దామని చెప్పారు.
ఇందుకోసం ఈనెల 9న తెలంగాణ భవన్లో బీసీలతో సమావేశమవుదామన్నారు. సమావేశానికి పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు హాజరుకావాలని చెప్పారు. అందరితో చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొదిద్దామన్నారు. సమావేశంలో శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, నోముల భగత్, కోరుకంటి చందర్, అంజయ్య యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, చెరుకు సుధాకర్, అంజనేయులుగౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.