TFCC | తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు వర్గాల మధ్య జరిగే లావాదేవీలకు రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాతపూర్వక ఒప్పందం లేకుండా వచ్చే ఫిర్యాదులను స్వీకరించబోమని ఛాంబర్ ప్రకటించింది.ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌కు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వివాదాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఎక్కువగా మౌఖిక ఒప్పందాలే ఉండటంతో వాటిని పరిష్కరించడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ వ్యాపార వ్యవహారాల్లో క్రమశిక్షణ తీసుకురావాలనే ఉద్దేశంతో TFCC ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
జనవరి 29, 2026న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన అనంతరం, రాతపూర్వక ఒప్పందం లేకుండా జరిగిన లావాదేవీలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను నమోదు చేయకూడదని, ప్రాసెస్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లావాదేవీ జరిగిన 15 రోజుల్లోపు అమలు చేసిన ఒప్పందం కాపీని ఫిర్యాదుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఫిర్యాదును పరిశీలించబోమని ఛాంబర్ స్పష్టం చేసింది.
సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే ఇరుపక్షాల బాధ్యత తమది కాదని, ప్రతి ఒప్పందం స్వంత బాధ్యతతోనే చేసుకోవాలని TFCC హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి స్వాగతిస్తూ, ఇది నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లను రక్షించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వివాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో మౌఖిక ఒప్పందాల వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు ఈ నిర్ణయం పరిశ్రమకు మేలు చేస్తుందని తెలిపారు.