కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఉమ్మడి జిల్లా ముఖ్యనాయకులతో ఈ విషయమై చర్చించారు. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని తరలించాలనేది ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులకు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని సూచించారు.
జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి 5 వేల మందిని, ఉమ్మడి జిల్లా పరిధిలోని మిగతా ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని తరలించాలని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులకు కార్యకర్తల సమీకరణపై పలు సూచనలు చేశారు. నియోజవర్గ ఇన్చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, పుట్ట మధూకర్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.