KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు నష్టం చేకూర్చేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటంపై పార్టీ పరంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నందినగర్‌లోని నివాసం లో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనిని గట్టిగా వ్యతిరేకించాలన్నట్టు తెలిసింది. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా అన్నట్టు సమాచారం.
రెండు, మూడు రోజుల్లోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేసి, విసృ్తతంగా చర్చించి, కార్యాచరణ రూపొందిద్దామని చెప్పినట్టు తెలిసింది. కేసీఆర్‌ను కలిసిన వారిలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య, రవీంద్రనాయక్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఆంధ్రా వాల్మీకి రామాయణంలో చందా ప్రయోగం పుస్తకాన్ని సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు అందజేయగా, సమకాలిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద రచించిన ది దక్కన్ పవర్‌ప్లే, మూడు దారులు పుస్తకాలను పాత్రికేయుడు దేవులపల్లి అమర్ అందజేశారు.