హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయనకు వివరించారు. త్వరలోనే సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, అందుకు అనుగుణమైన కార్యాచరణను అమలు చేస్తామని తనను కలిసిన నేతలకు కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని, ఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారని పార్టీ నేతలు తెలిపారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇటీవల గంగుల కమలాకర్, కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారంపైనా వారు స్పందించారు. తాము పార్టీ మారే ప్రసక్తేలేదని, తమ నాయకుడు కేసీఆరేనని ఈ సందర్భంగా గంగుల కమలాకర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. కరీంనగర్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీ కార్పొరేటర్లతో తమ అధినేత కేసీఆర్‌ను కలిశామని గంగుల తెలిపారు. పార్టీ మారుతున్నారంటూ కావాలనే తమపై ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.