హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ‘సర్’ ప్రక్రియ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండదని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి రెండుచోట్ల ఓటు హక్కు ఉందన్న విషయంపై స్పంది స్తూ.. ‘సర్’ ప్రక్రియ అనంతరం ఇలాంటి సమస్య ఉండదని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల నామినేషన్ పత్రాలు నింపే సమయంలో అన్ని కాలాలు భర్తీ చేయాలనే నిబంధన ఉన్నట్టు చెప్పారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసీచూడనట్టు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థు లు దాన్నే ఎత్తిచూపుతారని చెప్పారు. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో అని అన్నారు. కోర్టు కేసు వివరాలను భర్తీ చేయాలని మీనాక్షికి సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని వెల్లడించారు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత సీఈసీ పరిధిలో ఏమీ ఉండదని, మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఆర్వో నిర్ణయాన్నే సమర్థించిందని గుర్తుచేశారు.