హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ లాంగ్ టర్మ్ ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇందులో తొలి అడుగుగా పీవీఎల్ కోసం గురువారం విజయవాడలో ఓపెన్ ట్రయల్స్, అండర్-21 ఆటగాళ్ల టాలెంట్ హంట్ నిర్వహించింది. అండర్-21 విభాగానికి 105 మంది, పీవీఎల్ ట్రయల్స్‌కు 40 మంది ప్లేయర్లు హాజరై తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.
ఓపెన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 17వ తేదీన గోవాలో జరిగే ఆటగాళ్ల వేలంలోకి తీసుకెళ్తామని బ్లాక్‌హాక్స్ టీమ్ ఓనర్ హైదరాబాద్‌కు చెందిన కె. అభిషేక్ రెడ్డి తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది టాలెంట్ హంట్ నిర్వహణతో పాటు జిల్లా, గ్రామీణ స్థాయి టోర్నీలకు మద్దతు ఇస్తామన్నారు. నాలుగేండ్లుగా తెలుగు రాష్ర్టాల్లో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేస్తున్న బ్లాక్‌హాక్స్ ఫ్రాంచైజీని ఈ సందర్భంగా ఏపీ క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు అభినందించారు.