న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan)వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు అభ్యర్థి మీనాక్షి నటరాజన్.. బుధవారం ఈసీఐ అధికారుల్ని కలిశారు. ఆ బృందంలో అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్, భూపేశ్ భగల్, దీపా దాస్మున్సీ, రణదీప్ సుర్జేవాలా ఉన్నారు. మీనాక్షీ నటరాజన్‌పై కోర్టు కేసు ఉన్న కారణంగా ఆమె రాజ్యసభ నామినేషన్ పిటీషన్‌ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
అయితే దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ.. ఓ ప్రైవేటు ఫిర్యాదుపై మీనాక్షీకి కోర్టు నోటీసు వచ్చిందని, కానీ ఆమెపై ఎటువంటి కోర్టు కేసు లేదన్నారు. తప్పుడు పద్ధతిలో మీనాక్షీ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఫిర్యాదును కోర్టు పరిగణలోకి తీసుకోలేని కారణంగా , ఆమె పై ఎటువంటి కేసు పెండింగ్‌లో లేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రిట్నరింగ్ ఆఫీసర్ నిర్ణయం చాలా పేలవంగా ఉందని, ఏకపక్షంగా కూడా ఉన్నట్లు సింఘ్వీ ఆరోపించారు.
మీనాక్షీపై కేసు !
మీనాక్షీ నటరాజన్‌ను తెలంగాణ ప్రజలు నికార్సైన గాంధేయవాదిగానే చూశారు. ఆమెపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే ఆలోచన కూడా జనాలకు తెలియదు. 2025లో ఆమెపై క్రిమినల్ కేసుకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తున్నదని, అంటే పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆమెపై కేసు నడుస్తున్నది. తన ప్రభుత్వంలో తనపైనే నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఆమె వద్దే లేవు. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు మాత్రం మీనాక్షీ కేసు వివరాలు చేరాయి. ఇదేమీ తెలియకుండానే మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ గడువు ముగిసేంత వరకు వేచిచూసిన అక్కడి బీజేపీ నేతలు.. నామినేషన్ పత్రాల పరిశీలనకు ముందు ఆమెపై తెలంగాణలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సరిగ్గా పేరొనలేదని ఫిర్యాదు చేశారు. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, నామినేషన్ పత్రాల్లో ఓ కేసులో రెస్పాండెంట్‌గా ఉన్న సమాచారం దాచారనే కారణంతో మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ ఆనంద్ శర్మ తిరస్కరించినట్టు సమాచారం.