Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ నేతలే తనకు వెన్నుపోటు పొడిచారని ఏఐసీసీ దూత మీనాక్షీనటరాజన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో చెప్పినట్టు తెలిసింది. నామినేషన్ పత్రాల వ్యవహారాలు చూసుకొనేందుకు పార్టీ లీగల్ సెల్ ఉన్నప్పటికీ, తనకు సహకారం అందకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.
కోవర్టు రాజకీయాల వల్లే ఈ అంశం మధ్యప్రదేశ్ దాకా వెళ్లిందని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పినట్టు తెలిసింది. మీనాక్షి ఫిర్యాదు నేపథ్యంలోనే గురు, శుక్రవారాల్లో తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద రాహుల్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ నష్టం కలిగిస్తున్న వారిపై ఆయన ఘాటుగా స్పందించారు. మీనాక్షి నామినేషన్ తిరసరణ అంశాన్ని పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు.
దీని వెనుక అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికే అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పార్టీ అంతర్గత సమాచారం, వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూనే ప్రతిపక్షాలకు మేలు చేస్తున్న కోవర్టులెవరో గుర్తించే పనిలో నాయకత్వం ఉన్నదని ఆయన తెలిపారు.
‘ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో? గ్రీకువీరులు ఎవరో త్వరలోనే బయటపడుతుంది’ అని మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నామినేషన్ తిరసరణకు కారణమైన బాధ్యులు, పార్టీకి నమ్మకద్రోహం చేసిన కోవర్టులపై అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నదని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. త్వరలోనే ఈ లీకుల వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.