పాట్నా, ఆగస్టు 3: బీహార్‌లో బీజేపీ కంచుకోట బద్ధలైంది. బాంకీపుర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను 19,324 ఓట్ల తేడాతో ఓడించి తన పార్టీకి ఆయన తొలి ఎన్నికల విజయాన్ని అందించారు. బీహార్‌లో 30 ఏండ్లకు పైగా కమలం పార్టీ కంచుకోటగా నిలిచిన బాంకీపుర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని తన మొదటి ఎన్నికలోనే బీజేపీకి ఊహించని ఘోర పరాజయాన్ని ఆయన చవిచూపించారు. ప్రశాంత్ కిశోర్‌కు 64,151 ఓట్లు రాగా సిన్హాకు 44,827 ఓట్లు లభించాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచే ప్రశాంత్ కిశోర్ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, తదనంతరం ఏప్రిల్‌లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడంతో బాంకీపుర్ బీజేపీ ఎమ్మెల్యే పదవికి నితిన్ నబిన్ రాజీనామా చేయాల్సి రావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 1995 నుంచి నబిన్ తండ్రి దివంగత నవీన్ కిశోర్ సిన్హా, ఆ తర్వాత స్వయంగా నితిన్ నబిన్ బాంకీపుర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. తద్వారా ఈ స్థానాన్ని బీజేపీకి ఒక కంచు కోటగా మార్చారు. నితిన్ నబిన్, బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, దాదాపు 40 మంది కేంద్ర, రాష్ట్ర నాయకులతోసహా అధికార ఎన్డీయే కూటమి తన సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు.
బాంకీపుర్‌లో ప్రశాంత్ కిశోర్ గెలుపు నితిన్ నబిన్తోపాటు బీహార్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికీ ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తన విజయం ఖాయమని తేలిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ బాంకీపుర్ ప్రజలు తనపైన ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడమే తన మొదటి ప్రాధాన్యతని తెలిపారు. బాంకీపుర్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. రానున్న రెండు, మూడు నెలల్లోనే మార్పును మీరు చూస్తారని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వానికి బాంకీపుర్ ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని, బీహార్‌కు ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించమని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. 30 ఏండ్ల కంచుకోట 30 రోజుల్లో కూలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధిపై దృష్టి పెట్టే మంచి నాయకత్వం బీహార్‌కు అవసరమని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీని 6,016 ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. బ్యాంకు మోసం, వంచన కేసులో ఢిల్లీ కోర్టు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి శిక్ష విధించడంతో ఏప్రిల్‌లో ఆయన అనర్హతకు గురయ్యారు. దీంతో దతియా అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం జెన్‌జీ నిరసనల ప్రభావమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా జరిగిన మూడు అసెంబ్లీ బైపోల్స్‌లో బీజేపీ రెండు చోట్ల ఓడిపోవడం, గుజరాత్‌లోనూ భారీగా మెజారిటీ తగ్గడంతో కమలం పార్టీపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయం స్పష్టమవుతున్నదని చెబుతున్నారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జెన్‌జీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనకు దిగి వచ్చి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రాతినిధ్యం వహించిన బాంకీపుర్ కంచుకోటలో కమలం పార్టీ ఓటమి పాలవ్వడంలో జెన్‌జీ నిరసనల ప్రభావం గణనీయంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వడోదర జిల్లాలోని మంజల్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తన సీటును నిలబెట్టుకున్నప్పటికీ భారీ స్థాయిలో ఓట్ల శాతాన్ని కోల్పోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గెలుపు ఆధిక్యత గణనీయంగా తగ్గిపోయింది. బీజేపీ అభ్యర్థి సతీశ్ గోవింద్‌భాయ్ పటేల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి భికాభాయ్ రబారీని 30,630 ఓట్ల తేడాతో ఓడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానంలో బీజేపీ 1,00,754 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి యోగేశ్ పటేల్ జూన్‌లో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.