Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తనకు ఎంతో ఇష్టమైన తాత, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న తన కొత్త క్రియేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన కార్యాలయానికి ‘ఐకాన్జా’ అనే పేరును పెట్టారు.ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఐకాన్జా’ కేవలం కార్యాలయంగా కాకుండా.. భవిష్యత్ సృజనాత్మక ఆలోచనలకు వేదికగా ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. సినిమా కథలపై చర్చలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పన, భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు వంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నట్లు సమాచారం. అల్లు కుటుంబానికి సినిమా రంగంతో ఉన్న అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, తన ఆలోచనలు, కొత్త ప్రయోగాలకు అనుగుణంగా ‘ఐకాన్జా’ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్-ఇండియా స్థాయిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఆయన తదుపరి చిత్రంగా తెరకెక్కుతున్న ‘రాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ స్థాయి యాక్షన్, భావోద్వేగ అంశాలతో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.ఇదే సమయంలో అల్లు అర్జున్ భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించిన సన్నాహకాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఐకాన్జా’లో ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన కథా చర్చలు, సృజనాత్మక ప్రణాళికలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.