హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టిపెట్టిన ఆమె బుధవారం గాంధీభవన్లో నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి కొందరు పరిశీలకులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని పరిశీలకులుగా తొలగించినట్టు మీనాక్షి ప్రకటించారు. సమావేశానికి రాని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు మరో ఐదుగురు నేతలను పరిశీలకులుగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 70 మంది పరిశీలకులకు ఆహ్వానం అందగా హాజరుకాని వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించిన ఆమె, 2017 నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు ఉండేలా చూడాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.