మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 4 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది.16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌లో గురువారం ఇన్‌ఫ్లో 16,650 క్యూసెక్కులుగా ఉండగా, 8 బ్లాక్‌లో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు.
బరాజ్ రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం 89.30 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. నిరుడు ఇదే సమయానికి 93.20 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. ప్రసుత్తం బరాజ్ రివర్ బెడ్ నుంచి ప్రవాహం 1.30 మీటర్ల ఎత్తులో ఉన్నది. బరాజ్ వద్ద ప్రవాహాన్ని భారీ నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.