నర్సంపేట, జనవరి 1: జనరేటర్ ఆన్ చేయకుడా సెల్‌ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో బాధితుడి తలకు కుట్లు వేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పట్టణ శివారులో రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జనరల్ దవాఖానను అన్ని సౌకర్యాలతో నిర్మించారు. నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన సాంబయ్య ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడటంతో అతడి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు ఆటోలో నర్సంపేటలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, తలకు గాయం పెద్దగా ఉండటంతో వైద్య సిబ్బంది కుట్లు వేసేందుకు ఓపీ రూమ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది సెల్‌ఫోన్ టార్చ్లైట్లు వేసుకొని బాధితుడి తలకు కుట్లు వేశారు. దవాఖానలోని జనరేటర్‌ను ఉపయోగించకుండా చిమ్మచీకట్లో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులోనే వైద్యం చేశారు. జనరేటర్ వేయడంలో నిర్లక్ష్యం వహించిన వైద్యసిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.