Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రోగులు తమ ఆధార్ కార్డు లాంటి ఆధారాలు చూపాలని ఆంక్షలు విధించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైద్యసేవలు పొందాలనుకునే పేదలు ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం ఉన్నదా? అని ప్రశ్నించింది. ఆధార్ కార్డు లేనివారికి ఉస్మానియా దవాఖానలో చికిత్స అందించడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున్యాయవాది కాశ్ బాగ్గేకర్ వాదన వినిపిస్తూ.. వైద్యసేవలను ఆధార్ కార్డుతో ముడిపెట్టడం అన్యాయమని పేర్కొన్నారు.
ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిందని, ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆధార్ కార్డుతో నిమిత్తం లేకుండా వైద్యసేవలు అందించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. ఆధార్ కార్డు లేనివారికి సైతం ప్రభుత్వ దవాఖానల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో అందుకు ఆధారాలు చూపాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది.