హైదరాబాద్ జూన్ 15 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలోనే వైద్యరంగం పురోగమించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఆదివారం ఓ యూట్యూబ్ చానల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుమారు 500 మంది డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆవిర్భానికి ముందు తెలంగాణలో వైద్యరంగం వెనుకబడి ఉండేదని, కేసీఆర్ దూరదృష్టితో ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యమందించే లక్ష్యంతో జిల్లాకో మెడికల్, నర్సింగ్ కశాలలలను ఏర్పాటుచేశారని ఎంపీ రవిచంద్ర గుర్తుచేశారు. హరీశ్‌రావు సైతం మంత్రిగా దవాఖానల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభం ; వార్షిక మరమ్మతులు పూర్తి
ఫర్టిలైజర్‌సిటీ, జూన్ 15: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో నెల రోజుల తర్వాత ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఇటీవలే షట్‌డౌన్ చేశారు. ఉత్పత్తిలో కీలకమైన క్యాటలీస్ రాక ఆలస్యంతో ఎనిమిది రోజులపాటు లేటుగా ఉత్పత్తి మొదలైంది. 2022-23లో 8.40 లక్షల టన్నులు, 2023-24లో 11.95 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తిలో ప్రతి ఏడాది 40 శాతం అంటే సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ర్టానికే సరఫరా చేస్తున్నది. పలు రాష్ర్టాలకు 10 శాతం చొప్పున సరఫరా చేస్తున్నారు. రాష్ర్టానికి ఈ వానకాలంలో పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులోకి రానున్నది.