హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పైసా వసూల్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రజారోగ్య కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి డిప్యూటేషన్ (Deputation) కోసం దరఖాస్తు చేసుకున్న తనను రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్టు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆరోపించారు. దీంతో లక్ష రూపాయలకు బేరం కుదరగా.. తాను రూ.50 వేలను గూగుల్ పే ద్వారా పంపినట్టు వెల్లడించారు. అయితే సదరు ఉన్నతాధికారి డబ్బులు తీసుకొని డిప్యూటేషన్ అంశాన్ని పక్కనబెట్టి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. వాట్సాప్‌లో కోరికలు తీర్చాలంటూ మెసేజ్‌లు పంపుతున్నాడని తెలిపారు. ఇదే అంశమై ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించకోకపోవడంతో సదరు బాధితురాలు ఆరోగ్యశాఖ మంత్రితోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్, డీహెచ్‌కు లీగల్ నోటీసులు పంపడం ప్రకంపనలు సృష్టిస్తున్నది.
లీగల్ నోటీసులు బయటకు రావడంతో సదరు అధికారి లీలలు బయటకు వచ్చాయి. ఉన్నతాధికారి పంపిన అసభ్యకర మెసేజ్‌లకు సంబంధించి తన వద్ద డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయని సదరు మహిళా ఉద్యోగి నోటీసులో పేర్కొన్నారు. ఇంత చేసిన సదరు ఉన్నతాధికారిని సస్పెండ్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిరుడు జూలై 5న సదరు ఉన్నతాధికారి నంబరుకు రూ.50 వేలు పంపినట్టు ఆధారాలు జతచేశారు. తనను వేధించిన అధికారి 12 మందికి పైగా ఉద్యోగుల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేసి వారు కోరుకున్న చోట్ల డిప్యూటేషన్లు ఇచ్చినట్టు ఆరోపించారు. సదరు అధికారి జనరల్ ట్రాన్స్ఫర్లలో సైతం లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ఇలా దాదాపు రూ.54.50 లక్షల వరకు సదరు అధికారి వసూలు చేసినట్టు తెలిపారు. సదరు ఉన్నతాధికారిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణకు ఆదేశించాలని కోరారు.
మహిళా ఉద్యోగిని వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉన్నతాధికారిపై గురువారం ప్రజారోగ్యశాఖ బదిలీ వేటువేసింది. ఆయనను వేరే సెక్షన్‌కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సదరు ఉన్నతాధికారితోపాటు మరో నలుగురిని సైతం ఇతర సెక్షన్లకు బదిలీ చేసింది.