హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది. 28 రాష్ర్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉన్నట్టు బహిర్గతమైంది. మెడికల్ కాలేజీల్లో పరిస్థితులపై అధ్యయన వివరాలను ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్’ (ఎఫ్ఏఐఎంఏ) గురువారం వెల్లడించింది.
మెడికల్ కాలేజీల్లో బోధనా పద్ధతులు సరిగా లేవని తెలిపింది. 54.3 శాతం మంది మాత్రమే తరగతి గదులు సవ్యంగా నడుస్తున్నట్టు వెల్లడించారు. 44.1 శాతం మంది ల్యాబ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 73.9 శాతం మంది పని ఒత్తిడి అధికంగా ఉన్నదని చెప్పారు. 55.2 శాతం మంది సిబ్బంది కొరత ఉన్నదని వెల్లడించారు. 40.8 శాతం మంది వర్క్ ఎన్విరాన్మెంట్ సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు కాలేజీల్లో తరగతులు రెగ్యులర్గా జరుగుతున్నాయని పలువురు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 90.4శాతం ప్రభుత్వ, 7.8శాతం పలు కాలేజీలు పాల్గొన్నాయి.