KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాల తో ఏమిటీ చెలగాటం? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు బ్రేకులు పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. అడ్మిషన్లను ఇంకెంత కాలం సాగదీస్తారని ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. ‘తెలంగాణ బిడ్డలను నాన్లోకల్స్గా మార్చి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో33 అమ లుకు కాంగ్రెస్ సరారు ఎందుకు మొండిపట్టు పడుతున్నది? స్థానికతను నిర్ధారించే విషయాన్ని ఎందుకు వివాదస్పదం చేస్తున్నది? అడ్మిషన్ల ప్రక్రియను న్యాయపరమైన చికుల్లోకి ఎందుకు నెడుతున్నది?’ అని ట్వీట్ చేశారు. పిల్లలను డాక్టర్లుగా చూడాలని కలలుగంటున్న తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను 8,915కు పెంచుకుని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సరారు తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ విజన్‌కు కాంగ్రెస్ సరారు వైఫల్యంతో గ్రహణం పట్టిందన్నారు.
15వేలు ఇస్తామన్న జోకర్ పత్తాలేడు
కేసీఆర్ రైతుబంధు కింద రూ.పదివేలు ఇస్తే, తాను రూ.పదిహేను వేలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ జోకర్ ఎక్కడ? అని కేటీఆర్ ప్రశ్నించారు. వానకాలం సీజన్ ముగింపునకు ఇంకా 17 రోజులే మిగిలిందని, ఆ జోకర్ ఇప్పుడు పత్తాలేకుండా పోయారని విమర్శించారు.
అదానీ విషయంలో ప్రపంచం కండ్లు తెరిచినా..
అదానీ విషయంలో ప్రపంచం కండ్లు తెరిచినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కండ్లు మూసుకునే ఉన్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదానీకి సంబంధించి స్విట్జర్లాండ్ (స్విస్) 311 మిలియన్ డాలర్లను ఫ్రీజ్ చేసిందని ఉదహరించారు. ప్రపంచ దేశాల్లో అదానీ అవకతవకల వ్యవహారం వెలుగుచూస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆయనతో అంటకాగుతున్నాయని మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ క్రోనీ క్యాపిటలిస్టులను రక్షించడానికి ఇంకా ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు.