కొణిజర్ల, సెప్టెంబర్ 12: సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల తలంటింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది. రెండుమూడు నెలలుగా రాష్ర్టాన్ని యూరియా కొరత పట్టి పీడిస్తున్నది. అన్నదాతలు పగలు రాత్రి తేడా లేకుండా సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. లైన్లలోనే కొందరు రైతులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరికొందరు యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం యూరియాపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. రైతులను వారి మానాన వారిని వదిలివేసింది. దీంతో అన్నదాతలకు క్యూలలో పడిగాపులు తప్పడం లేదు. దీంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్లిన టీన్యూస్ రిపోర్టర్‌పై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసి తమ దమన నీతిని చాటుకున్నారు.
గురువారం కొణిజర్ల పీఏసీఎస్ కార్యాలయంలో యూరియా పంపిణీ జరగ్గా వందల మంది రైతులు అక్కడికి చేరుకుని యూరియా కోసం గంటలకొద్దీ నిరీక్షించారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల తల్లలు సైతం క్యూలో ఇబ్బందిపడ్డారు. వీరి బాధలను లైవ్‌లో చూపించేందుకు టీన్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు ప్రయత్నించారు. దీంతో రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు వరుసకట్టారు. ఇది గమనించి అక్కడే ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ హరీశ్ టీన్యూస్ ప్రతినిధికి అడ్డుతగులుతూ తన మొబైల్ ఫోన్‌తో సాంబశివరావును వీడి యో తీయడం ప్రారంభించాడు. అది చూసిన సాం బశివరావు తనను ఎందుకు వీడియో తీస్తున్నావని కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జనం రద్దీలో కానిస్టేబుల్ మొబైల్ కిందపడింది. దీనికి నువ్వు కారణమంటే, నువ్వు కారణమంటూ ఇద్దరూ స్థానిక పోలీసుల దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. వారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు.
సంబంధం లేని వ్యక్తితో ఫిర్యాదు
ఆ తర్వాత కాసేపటికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో టీన్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై కేసు నమోదు చేయించినట్టు తెలిసింది. దీనిపై మీడియా సభ్యులు వివరణ కోరగా పోలీసులు స్పందించలేదు. పోలీసులు నోరు మెదపనప్పటికీ కేసు నంబర్ 259/2025, సెక్షన్151, 196, 353(2), రెడ్‌విత్ 3(5), బీఎన్ఎస్ -2023(124, 153ఎ, 505, రెడ్‌విత్ 34 ఐపీసీ) ప్రకారం సాంబశివరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది.
అక్రమ కేసుపై ఆగ్రహజ్వాల
జర్నలిస్టు సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్టు సంఘాల, రాజకీయ నాయకులు ఖండించారు. సాంబశివరావుపై కేసు నమోదు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నిప్పులు చెరిగారు. జర్నలిస్టులను వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, మీడియా స్వేచ్ఛను అణచివేయడం సరికాదని బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంబశివరావుపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్ ఖండించారు. ఖమ్మం జిల్లా టీన్యూస్ జర్నలిస్టు సాంబశివరావుపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఉద్యమనాయకుడు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.
అణచివేతలతో జర్నలిస్టులను భయపెడతారా?: హరీశ్‌రావు
రైతుల యూరియా కష్టాలను కండ్లకు కట్టినట్టు చూపిస్తున్న జర్నలిస్టులను అణచివేయడం, అక్రమ కేసులతో వేధించడం దుర్మార్గమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్నదాతల ఎరువుల వెతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు యత్నించిన ఖమ్మం టీ న్యూస్ విలేకరి సాంబశివరావుపై అక్రమ కేసు బనాయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకు యత్నించిన విలేకరులపై ఉల్టా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాంతిభద్రతల నిర్వహణను పక్కనబెట్టి ప్రజల గొంతునొక్కడం శోచనీయమని అన్నారు. సాంబశివరావుపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
యూరియా కష్టాలను చూపితే కేసులా?: కేటీఆర్
రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూపిన ఖమ్మం జిల్లా టీ న్యూస్ జర్నలిస్టుపై అక్రమం కేసు పెట్టిన పోలీసులు, ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించే సమయంలో వేధించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలను పట్టించుకోని పాలకులు, వాటిని బహిర్గతం చేసిన జర్నలిస్టులను, మీడియాను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులు కాంగ్రెస్ సర్కారు నిరంకుశ ధోరణి, ఇందిరమ్మ పోలీస్ రాజ్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాసామ్యంలో మీడియా స్వేచ్ఛ ముఖ్యమని వ్యాఖ్యానించారు. సాంబశివరావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.