హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇలా చేస్తే తాము మద్దతు ఇస్తామని, ఎవరు కోర్టుకు వెళ్లినా ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే బీసీలకు అన్యాయం చేయడమేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, అందులో కూడా మహిళలకు సగం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివేదికలోని అంశాలు సెలెక్టివ్‌గా తీసుకుంటామంటే కుదరదని ఆక్షేపించారు. కులగణన, ఎస్సీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ నివేదికలను పూర్తిగా అసెంబ్లీ, కౌన్సిల్లో పెట్టాలని పునరుద్ఘాటించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో బుధవారం మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలని సూచించారు.
కులగణన సర్వేలో మూడు శాతానికిపైగా ప్రజలు పాల్గొనలేదని ప్రభుత్వం అంటున్నందున, పాల్గొనని వారికి సర్వేలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని సూచించారు. మొత్తానికి మొత్తం రీ సర్వే అంటే కాంగ్రెస్ సర్కారు రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రమాదం ఉంటుందని చెప్పారు. కౌన్సిల్లో వాకౌట్ విషయంలో కొంత అయోమయం నెలకొన్నదని, వాదన బలంగా వినిపించాలనే తనతోపాటు కొంతమంది ఎమ్మెల్సీలంతా సభలోనే ఉన్నామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టులో అనుభవం ఉన్న లాయర్‌ను పెట్ట్టి కొట్లాడితే తమిళనాడు తరహా రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, పార్టీ పరంగా ఇవ్వడానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎందుకు? డెడికేషన్ కమిషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఖ మ్మం, కొత్తగూడెంలో జాగృతి ఆధ్వర్యం లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబు ల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.