ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి
కేంద్ర సర్కారు ఇవ్వకున్నా కట్టి చూపుతున్న కొత్త రాష్ట్రం
కొండకల్లో ప్రైవేటు కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం
వెయ్యి కోట్లతో భారీగా ఏర్పాటుచేస్తున్న మేధా గ్రూప్
ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్ల ఉత్పత్తి
రైల్వే కోచ్‌ల ఉత్పత్తి రాష్ర్టానికి గర్వకారణం: మంత్రి కేటీఆర్
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా గ్రూపు నిర్మిస్తున్న కొండకల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణ త్వరలో రైల్ కోచ్‌ల తయారీ, ఎగుమతి కేంద్రంగా మారనున్నదని చెప్పడానికి గర్విస్తున్నా. మేధా గ్రూప్ చైర్మన్ యుగంధర్‌రెడ్డి, ఆయన బృందానికి ధన్యవాదాలు.
-ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, దిగ్గజ కంపెనీలకు నెలవైన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్ కోచ్‌ల తయారీ, ఎగుమతికి కేంద్రం కానున్నది. రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా సర్వో సంస్థ ఏర్పాటుచేస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. రూ.1,000 కోట్లతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తున్నారు. ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్‌లు ఉత్పత్తి చేసేలా భారీగా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, 1,200 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం ఇవ్వకున్నా, ప్రైవేటు సంస్థకు ఇతోధికంగా సహాయ సహకారాలందించి రాష్ట్రప్రభుత్వం తెలంగాణ గడ్డపై రైల్కోచ్ల ఉత్పత్తిని సాధ్యం చేస్తున్నది. రైల్ ఇంజిన్లకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్రైన్‌సెట్స్, కోచ్‌లు తదితర ఉత్పత్తులను తయారుచేస్తున్న మేధా సంస్థ, భారతీయ రైల్వేలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది. రైల్వే పరికరాల ఉత్పత్తిలో ఉన్న ప్రైవేటు సంస్థలో మేధా దేశంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో బస్సులు, ట్రాక్టర్లు, విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలు తయారవుతుండగా, త్వరలో రైల్వే కోచ్‌లు కూడా ఉత్పత్తి కానున్నాయి. 1984లో ప్రారంభమైన మేధా సంస్థ 1990లో రైల్ కోచ్‌లు, రైళ్లకు సంబంధించిన విడిభాగాల తయారీ చేపట్టింది. భారత్‌తోపాటు అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో 12 కంపెనీలు, ఏడు అనుబంధ సంస్థలు, భారత్‌లో నాలుగు జాయింట్ వెంచర్ కంపెనీలు దీనికి ఉన్నాయి. ఈ సంస్థలో 3,500 మంది పనిచేస్తున్నారు.
ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో..
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో ప్రైవేటు రంగంలో రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేధా సంస్థ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. వరంగల్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీ విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేదు. కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ ఫలితంలేదు. ఈ క్రమంలో మేధా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుండటం గమనార్హం.
తెలంగాణకు గర్వకారణం: మంత్రి కేటీఆర్ ట్వీట్
రాష్ట్రంలో రైల్ కోచ్‌లు తయారు కానునండటం తెలంగాణకు గర్వకారణమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన్ మేధా గ్రూపు నిర్మిస్తున్న కొండకల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణ త్వరలో రైల్ కోచ్‌ల తయారీ, ఎగుమతి కేంద్రంగా మారనుందని చెప్పడానికి గర్విస్తున్నా. మేధా గ్రూప్ చైర్మన్ యుగంధర్‌రెడ్డి, ఆయన బృందానికి ధన్యవాదాలు’ అని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్యాక్టరీ ఫొటోను పోస్ట్ చేశారు.