వరంగల్, జనవరి 14 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : మేడారం జాతరలో ఐదో గద్దె వెలసింది. కొత్తగా వెలసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లీబిడ్డలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మేడారంలో ఉన్నవి ఆ నాలుగు గద్దెలే. ఈసారి భక్తులకు వనం పోతరాజు గద్దె ప్రత్యక్షం కాబోతున్నది. కొత్తగా వెలసిన వనం పోతరాజు గద్దె వెనుక కథ ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. వనం పోతరాజు సమ్మక్కకు తమ్ముడని, ఆమె సైన్యానికి అధిపతి అని చెప్తున్నారు. మేడారం గద్దెల ప్రాంగణంలో మిగతా గద్దెలను పోలినట్టే ఒక గద్దెను వేశారు. గద్దె, దానిపై కర్రస్తంభం, స్తంభం పాదాల దగ్గర అలుకుపూత, ముగ్గులు, దీపం పెట్టి భక్తులకు పసుపు-కుంకుమలతో బొట్టుపెడుతూ పూజారులు దీవిస్తున్నారు. గద్దె పేరును సూచించేలా ‘శ్రీ వనం పోతరాజు గద్దె’ (శ్రీసమ్మక్క తమ్ముడు) సేనాధిపతి’ అనే బోర్డు పెట్టారు.
తాము సమ్మక్క తమ్ముడు పోతరాజు వారసులమని, తమదీ కోయజాతేనని వనం పోతరాజు గద్దె దగ్గరున్నవాళ్లు పేర్కొంటున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మేడారం జాతరను గతంలో ఎప్పుడూలేనివిధంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తున్నామని ప్రకటిస్తున్నది. జాతరను భవిష్యత్తరాలకు అందించేందుకు ప్రకృతిని శిల్పలిఖితంగా మలుస్తున్నామని పేర్కొంటూ అందుకు తగ్గట్టుగానే పనులు చేయిస్తున్నది. అందులో భాగంగానే సమ్మక్క-సారలమ్మ గద్దెలకు దాపున ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను భక్తుల సౌకర్యం కోసం వరుస గద్దెలుగా తీర్దిదిద్దుతున్నారు. సమ్మక్క-సారలమ్మ మూలగద్దెల స్థానాలు ఏమాత్రం కదల్చకుండా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను వరుస క్రమంలో పునఃప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు గద్దెలు, గద్దెల చుట్టూ శిలాకృతులు, వాటిపై కోయగిరిజన ఆరాధ్యదైవాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించే చిత్రాలు చెక్కుతున్నారు.
మేడారం గద్దెల ప్రాంగణంలో వెలసిన పోతరాజు గద్దెపై భక్తులు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. మేడారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పగిడాపూర్వాసులు పోతరాజును కొలుస్తున్నారు. మేడారం జాతరలో సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చే రోజు ఉదయం ప్రధానవడ్డె (పూజారి),ఇతర వడ్డెలు పగిడాపూర్ సమీపంలోని వనంగుట్ట (స్థానికులు అనంగుట్టగా పిలుచుకుంటారు)కు వెళ్లి కంకవనానికి ప్రత్యేకపూజలు చేసి కొంతవనాన్ని తెచ్చి మేడారంలోని సమ్మక్క గద్దెపై ఉంచుతారు. సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు. సంప్రదాయం ప్రకారం సమ్మక్క కన్నా ముందే పోతరాజు వచ్చి అంతా బాగానే ఉందని సంకేతం ఇచ్చిన తరువాతే సమ్మక్క చిలుకలగుట్ట నుంచి కిందికి దిగుతారని, పోతరాజు సమ్మక్కకు తమ్ముడే కాదు, సేనాధిపతి అని కూడా పగిడాపూర్కు చెందిన కాయం ఎల్లయ్య వివరిస్తున్నారు. మేడారంలోని మ్యూజియం దగ్గర (ఇంగ్లిష్‌మీడియం స్కూల్ సమీపంలో) ఉన్న పగిడాపూర్ వెళ్లే మార్గంలో వనం పోతరాజు ఆర్చ్ ఉందని ఆయన ఉదహరించారు. కాగా, జాతర చరిత్రలో వనం పోతరాజు చరిత్ర లిఖితం కాలేదని చెప్తూనే ఆదివాసీ గిరిజనుల్లోని కోయ, నాయక్‌పోడ్ తెగల్లో పోతరాజు కాన్సెప్ట్ ఉందని, అది 12వ శతాబ్దం నుంచి కనిపిస్తున్నదని చరిత్ర పరిశోధకులు పేర్కొనటం గమనార్హం. ఏదీఏమైనా వనంపోతరాజు సమ్మక్కకు సేనాధిపతా., తమ్ముడా., కాదా? అనేది లోతుగా పరిశోధిస్తేగానీ తెలిసే అవకాశం లేదని వారు చెప్పారు.
ఎన్నడూలేనివిధంగా మేడారం జాతరలో ఈసారి ఐదో గద్దె దర్శనం ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గద్దెల రూపురేఖలు మారుస్తున్న క్రమంలో తమకూ అవకాశం ఇవ్వాలని పగిడాపూర్వాసులు కోరారని, దాన్ని ప్రభుత్వం తోసిపుచ్చటంతో ‘మేం లేకుండా సమ్మక్క ఎట్లా వస్తుందో చూస్తాం?’ అని తెగేసి చెప్పటమే కాకుండా తామూ అక్కడ గద్దె వేస్తామని, ఎవరు ఆపుతారో చూస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ గద్దె వెలసినట్టు స్పష్టమవుతున్నది. కాగా, ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా వారి ఇష్టానుసారమే పనులు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పదేపదే ప్రకటిస్తున్న తరుణంలో నాలుగు గద్దెలు ఒకలా? ఇప్పటి వరకు లేని గద్దెను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందరికీ సమన్యాయం కల్పించటమే తమ విధానమని, అందుకే జాతర చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా ఈసారి ప్రాంగణంలోనే పగిడాపూర్వాసుల అభిప్రాయాలు గౌరవిస్తూ పోతరాజు గద్దెను ఏర్పాటు చేశామనే వాదన వినిపిస్తున్నది. మొత్తంగా వాదనలు, ఆవిష్కరణలు, అలజడులు ఎన్ని ఉన్నా ఆ సమ్మక్కే చూసుకుంటుందనే విశ్వాసాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.