ములుగు, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా భావించే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు 2026 జాతర చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. జాతరలో అభివృద్ధి పనులతోపాటు ఆలయాన్ని రాతి కట్టడాలతో నిర్మించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పిన ప్రభుత్వ మాటలు నీటి మూటలుగా మారాయి. ప్రభుత్వం చెప్పిన గొప్పలను నమ్మి ఆలయ నిర్మాణాన్ని కన్నులారా చూసి తల్లులకు తనివితీరా మొక్కులు చెల్లిద్దామని ఎంతో ఆశగా వచ్చిన భక్తులకు దర్శనం ఒక పెద్ద సవాల్‌గా మారిపోయింది.
జాతర ప్రారంభం నాటికి పనులు పూర్తికాకపోవడం భక్తుల దర్శనానికి అడ్డంకిగా మారింది. మేడారంలో విధులు నిర్వహించిన అధికారులు భక్తుల దర్శనాలకు అడ్డుగోడగా నిలిచారు. వీవీఐపీ, వీఐపీ, సాధారణ క్యూలైన్ అని షెడ్లు వేసి మరీ క్యూలు ఏర్పాటు చేస్తే భక్తులు తల్లుల సన్నిధికి చేరుకునేందుకు తిప్పలు పడు తూ వెళ్లాల్సి వచ్చింది. మేడారం చేరుకునేందుకు ట్రాఫిక్ ఒక అడ్డంకి అయితే చేరుకున్న తర్వాత దర్శన భాగ్యం మరో సమస్యగా మా రింది.
దర్శనమైన తరువాత బస చేద్దామంటే తాగునీటి గోస, టాయిలెట్ల కొరతతో భక్తులు తల్లడిల్లిపోవాల్సిన పరిస్థితులు మేడారంలో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సారలమ్మ, సమ్మక్కలు గద్దెకు చేరిన నాటి నుంచి వనదేవతల ప్రవేశం వరకు భక్తులకు వీఐపీలు, వీవీఐపీలు, పోలీస్, ఇతర శాఖల అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల దర్శనాలు భక్తులను ముప్పతిప్పలు పెట్టాయి. మేడారం జాతర విజయవంతానికి కృషిచేయాల్సిన అధికార యంత్రాంగం దర్శనాల కోసం పోటీ పడి మరీ జాతరను ఫెయిల్ అయ్యేలా చేశారు. నెలల తరబడి విధులు ని ర్వహించామని చెప్పుకొంటున్న అధికారులు సైతం తల్లుల సేవకు న్యాయం చేయలేకపోయారు.

తిరుగు ప్రయాణం భక్తులకు పెను సవాల్‌గా మారడంతో ఆగ్రహానికి లోనైన భక్తులు బస్సుల అద్దాలు పగలగొట్టి.. ‘సీఎం డౌన్‌డౌన్.. సీతక్క డౌన్‌డౌన్.. ఆర్టీసీ డౌన్‌డౌన్’ అనే పరిస్థితులకు దారితీసింది. జంపన్నవాగులో పడి ఇద్దరు, గుండెపోటుతో ముగ్గురు భక్తులు, అనారోగ్యంతో ఒకరు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మొక్కులు అప్పగించి ఆనందంతో ఇంటికి చేరుదామని ఆశించిన బాధిత కుటుంబాల్లో మేడారం జాతర చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సదరు కుటుంబాలను ఆదుకొని అండగా నిలుస్తున్నామనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించలేకపోయింది.
మేడారం మహాజాతర విఫలానికి కారణాలు ఏమిటనేది జాతర పూర్తయి రెండు రోజులు గడిచినా మిస్టరీగానే మిగిలిపోయాయి. కారణాలను తెలియజేయాల్సిన అధికారులు, స్థానిక మంత్రి.. జాతర అంతా సవ్యంగానే జరిగిందని తప్పులను వెనుకేసుకొని రావడం జాతరకు వచ్చి ఇబ్బందులుపడ్డ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జాతర ప్రారంభానికి ఒకరోజు ముందు జనవరి 27వ తేదీన ఓ భక్తుడు అనారోగ్యానికి గురికాగా కల్యాణ మండలంలో ఏర్పాటుచేసిన దవాఖానకు తరలించగా చికిత్స చేసే క్రమంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సరైన వైద్యం అందక మృతి చెందాడు.
జాతరకు ముందు రోజే విద్యుత్తు సరఫరా నిలిచిపోయినప్పటికి విద్యుత్తు శాఖ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో జాతర జరిగిన నాలుగు రోజుల్లో కీలక సమయాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంత్రి అడ్లూరి కాన్వాయిపై దాడి సైతం విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన సమయంలోనే జరిగింది. దొంగతనాలు, గుడారాల ప్రాంతాల్లో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకువచ్చిన సమయంలో ఆదివాసీ యువకులకు, పోలీస్ అధికారులకు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.
ఈ క్రమంలో పరస్పర దాడుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతోపాటు ఓ పోలీస్ ఉన్నతాధికారిపై సైతం ఆదివాసీ యువకులు చేయిచేసుకున్నట్టు తెలిసింది. సమ్మక్క తల్లిని గద్దెకు తెచ్చే రోజున పోలీసులు బందోబస్తు చర్యలో భాగంగా గద్దెలను స్వాధీనం చేసుకొని తాళాలు వేయడంతో పూజారుల సంఘం అధ్యక్షుడి కుమారుడు, ఆలయ పూజారి సైతం ప్రభుత్వ, పోలీసుల తీరుపై మండిపడ్డారు. నూతనంగా నిర్మించిన క్యూల్లో రద్దీ పెరగడం, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం పలు సందర్భంల్లో భక్తులు ఆందోళన వ్యక్తంచేశారు.
క్యూలను క్రమబద్ధీకరించాల్సిన పోలీస్ అధికారులు సహనం కోల్పోయి భక్తులపై దాడులు చేసి రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో కొందరు భక్తులు సమ్మక్క మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. శుక్రవారం వీఐపీల తాకిడి పెరగడంతో కలెక్టర్ జారీ చేసిన పాసులు చెల్లుబాటు కాకుండాపోయాయి. వీఐపీ, వీవీఐపీ క్యూలను ఎత్తివేయడంతో పాసులు పొందిన భక్తులు దర్శనానికి ఇబ్బందులుపడి పాసుల జారీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొందరు భక్తులు దర్శనం చేసుకోకుండానే ఆలయం బయట దండం పెట్టుకొని వెళ్లిపోయారు.
జాతర విఫలానికి కారణమైన అధికా రులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్య క్తమవుతున్నాయి. జాతర పూర్తయిన త ర్వాత చర్యలుంటాయనే అనుమానాలతో కొందరు కాంట్రాక్టర్లు తాము చేసిన అభి వృద్ధి పనుల బిల్లులను శనివారం రాత్రి ఆ గమేఘాల చేయించుకునే ప్రయత్నాలు చే శారు. మంత్రి సీతక్క ఆది, సోమవారాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జరిగిన తప్పులను గుణపాఠంగా భావిస్తామ ని, ఉద్దేశపూర్వకంగా భక్తులకు ఇబ్బందు లు కలిగేలా చేయలేదని అధికారులను వె నుకేసుకొని వచ్చేలా మాట్లాడారు.
జాతర విజయవంతమైందని పేర్కొంటూ పా సులు పొందిన వీఐపీలు ఒక్కొక్కరు 30 నుంచి 50 వాహనాల్లో రావడం ద్వారానే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మంత్రి పేర్కొన్నట్టుగా చెక్‌పోస్టుల వద్ద ఉన్న అధికారులు 30 నుంచి 50 వాహనాలను పాసులు లేకుండా ఎందుకు అనుమతించారన్నది స్పష్టంచేయలేదు. తప్పులన్నీ కండ్లకు కనిపించినా, వాటిని ఎత్తి చూపిన మీడియాతోపాటు సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవాలను అవాస్తవాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. చిన్నచిన్న లోపాలు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని పేర్కొనడం గమనార్హం.