హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలోని యూనివర్సిటీలను స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తాం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ‘మాటలు ఘనం.. చేతలు శూన్యం’, ‘హామీలు హైటెక్.. యూనివర్సిటీలు లోటెక్’ అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క యూనివర్సిటీలో సరిపడా ఆచార్యుల్లేరు. దీంతో యూనివర్సిటీలు పతనం దిశగా అడుగులేస్తున్నాయి. రిసెర్చ్ అట్టడుగునకు చేరింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండున్నరేండ్లు దాటింది. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఒక్క యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 70 శాతానికి పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లు అతిథి, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే నడుస్తున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లకైతే హెచ్‌వోడీలూ లేని పరిస్థితి. రెగ్యులర్ నియామకాలు లేకపోవడంతో అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీతో వర్సిటీలను నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా నియామక ప్రక్రియలు వేగవంతం చేసి యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సి ఉన్నది.
ఒకప్పుడు ఓయూ ఆచార్యులు సెంట్రల్ యూనివర్సిటీలకు వీసీలుగా సేవలందించిన రోజులున్నాయి. ప్రఖ్యాత సంస్థలకు అధిపతులుగా పనిచేసిన దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని పలు వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లు దొరుకడం కష్టమవుతున్నది. అంతే కాదు పలు ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించడం కష్టంగా మారింది. పలు డిపార్ట్మెంట్లకు హెచ్వోడీలుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని వర్సిటీల్లో ఆచార్యులు లేక కోర్సులను రద్దు చేస్తున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదేశాలిచ్చారు. అయినా నియామకాల్లో పురోగతి లేకపోవడం గమనార్హం.
యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం 2025 ఏప్రిలో జీవో జారీ చేసింది. ఈ జీవో వెలువడి ఏడాది గడిచింది. అయినా నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నోటిఫికేషన్లు, ఎంపిక ప్రక్రియ, నియామకాలపై స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు, అధ్యాపక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. హామీలు కాదు నియామకాలే ముఖ్యమని విద్యార్థి సంఘాల నేతలంటున్నారు. ఉపాధ్యాయ నిష్పత్తి తగ్గితే వర్సిటీ ర్యాంకింగ్ దెబ్బతినే ప్రమాదముందని ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు ఆందోళన వ్యక్తంచేశారు. కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో 1 :3 :6(ప్రొఫెసర్, అసొసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్)నిష్పత్తి దారుణంగా దెబ్బతిన్నదని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఓయూ సహా యూనివర్సిటీల్లో అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నది. పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగడం లేదు. కేవలం కాగితపు డిగ్రీలిచ్చే కేంద్రాలుగా యూనివర్సిటీలు తయారయ్యాయి. ఓయూలో బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంసీఏ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ లేరు. ప్రభుత్వం తక్షణమే పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి.
ఆచార్యులు లేకపోవడంతో వర్సిటీల్లో పరిశోధన కుంటుపడింది. ప్రభుత్వం గాలిమాటలు పక్కనబెట్టి రిక్రూట్మెంట్ చేపట్టాలి. పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల్లో ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభించారు. కోర్సులు ప్రారంభమయ్యయి. కానీ ఆచార్యుల్లేరు. కాలేజీలు ప్రారంభించినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారు. సర్కార్ తీరును ఖండిస్తున్నాం.