హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ): క్లాస్ రూంలో ఒక పిల్లవాడి పెన్సిల్ పోయింది. బ్యాగు మొత్తం దులిపి చూసినా దొరుకలేదు. దీంతో వెక్కి వెక్కి ఏడ్వటం మొదలుపెట్టాడు. ఇంతలో సార్ వచ్చి ఏమైందని ఆరా తీశారు. మిగతా పిల్లలను చూస్తూ ‘వాడి పెన్సిల్ తీసింది ఎవరు?’ అని గద్దించి అడిగారు. అయినా దొంగ ఎవరో బయటపడలేదు. పిల్లవాడి ఏడుపు మరింత పెరిగింది. దీంతో ఆ సార్ ‘ఊరుకో.. పెన్సిల్ బయటికి తెప్పిస్తా’ అని ధైర్యం చెప్పారు. అటెండర్‌ను పిలిచి ‘పసుపు బియ్యం కలిపి మంత్రించి తీసుకురాపో’ అని పురమాయించారు. అటెండర్ 5 నిమిషాల్లో పసుపు బియ్యం సిద్ధం చేశాడు. ‘ఒకరి తర్వాత ఒకరు వచ్చి నేను పెన్సిల్ తీసుకోలేదు అని ప్రమాణం చేసి మంత్ర బియ్యం నోట్లో వేసుకోండి. దొంగతనం చేసినోడి నోరు పిడసకట్టి, వాంతులు అవుతాయి’ అని హెచ్చరించాడు.
ఇదంతా ఒక మూఢనమ్మకం అనుకుంటున్నారు కదా. అచ్చం ఇలాంటి ఘటనే మెదక్ పట్టణంలో జరిగింది. అదేదో మారుమూల స్కూల్లో విద్యార్థుల కోసం లోకజ్ఞానం లేని వ్యక్తి చేసింది కాదు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిగిన యదార్థమని మెదక్ పట్టణంలో చర్చ జరుగుతున్నది. తనపక్కనే హరీశ్‌రావు కోవర్టులు చేరారని మైనంపల్లికి చాలా రోజులుగా అనుమానం ఉన్నది. అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరా? అని ఆరా తీస్తూనే ఉన్నా, ఎవరూ అనుమానాస్పదంగా కనిపించడం లేదు. బహిరంగంగా హెచ్చరించినా ఫలితం కనిపించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ నేతలను తన ఇంటికి పిలిచి పసుపు కలిపిన బియ్యం చేతిలో పెట్టి ‘మేము హరీశ్‌రావు కోవర్టులం కాదు’ అని ప్రమాణం చేయమని చెప్పినట్టు చర్చ జరుగుతున్నది.
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి హరీశ్‌రావు కోవర్టులు దూరిపోయారని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు సమాచారం అందిస్తున్నారని మైనంపల్లి కొన్నాళ్లుగా అనుమానిస్తున్నారు. నిరుడు డిసెంబర్ 16న మెదక్ జిల్లా కల్వకుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. ఎవరైనా కోవర్టులు ఉంటే వెళ్లిపోవాలని చెప్పినా వెళ్లడం లేదని, కోవర్టులను ఏరివేస్తే తప్ప పార్టీకి పునర్వైభవం రాదని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన కోవర్టులను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారని మైనంపల్లి అనుచరులు చెప్తున్నారు. కోవర్టులెవరో నిగ్గు తేల్చడానికి పార్టీ కార్యకర్తలకు, మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతలకు తోచిన పరీక్షలన్నీ పెడుతూనే ఉన్నారట. కానీ ఇప్పటివరకు ఒక్క కోవర్టు కూడా బయటపడలేదని మైనంపల్లి అనుచరులు చెప్పుకుంటున్నారు.
తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచులను మూడు రోజుల క్రితం మైనంపల్లి తన ఇంటికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఆశీర్వాదం తీసుకోవడంతోపాటు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై చర్చించవచ్చనే ఆలోచనతో దాదాపు 15 మంది కాంగ్రెస్ సర్పంచులు, మెదక్ జిల్లాకు చెందిన 10 మంది కాంగ్రెస్ కీలక నాయకులు ఆయన ఇంటికి వెళ్లినట్టు సమాచారం. అందరూ సమావేశమైన తర్వాత ‘మీలో ఎంతమంది హరీశ్‌రావు కోవర్టులు ఉన్నారో, వారంతా స్వచ్ఛందంగా లేచి వెళ్లిపోండి’ అని సూచించినట్టు తెలిసింది. అయినా సర్పంచులు, నేతలు ఎవరూ లేవలేదట. దీంతో పసుపు కలిపిన బియ్యం తీసుకురమ్మని మైనంపల్లి తన భార్యకు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పసుపు బియ్యం పనిమనిషి తీసుకురాగా, ఆమెతోనే అందరి చేతుల్లో బియ్యం పెట్టించినట్టు తెలిసింది. ‘మేం హరీశ్‌రావు కోవర్టులం కాదు’ అని పసుపు బియ్యం నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో కొందరు నేతలు కంగుతినగా, ఆయన విచిత్ర ప్రవర్తనను కొంతకాలంగా గమనిస్తున్న మరికొందరు కాంగ్రెస్ నేతలు కొందరు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా ప్రమాణం చేశారట. నలుగురైదుగురు నేతలు తాము ప్రమాణం చేయమని మొండికేసినట్టు సమాచారం. ప్రమాణం చేయకపోతే కోవర్టులుగా భావిస్తామని మైనంపల్లి బెదిరించడంతో మరికొందరు నెత్తిన బియ్యం పెట్టుకున్నారట. అయినా ఇద్దరు నేతలు పసుపు బియ్యం ప్రమాణం చేయకుండా బయటికి వచ్చినట్టు మెదక్ పట్టణంలో చర్చ జరుగుతున్నది.