Heavy Rain | హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అత్యధికంగా 119.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మసాయిపేటలో 112 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో 99.8 మి.మీ., హైదరాబాద్లోని బండ్లగూడలో 98.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి.