ఆదిలాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ) : వేలాదిమందికి ఉపాధి కల్పించడంతోపాటు సిమెంట్ రంగానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో మూతపడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తిరిగి ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. జిల్లా ప్రజలతోపాటు వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులు సీసీఐ సాధన కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేపడుతున్నా.. రెండు ప్రభుత్వాల్లో చలనంలేదు. ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన రెండు ప్రభుత్వాలు విలువైన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ భూముల విక్రయానికి చర్యలు ప్రారంభించాయి. మూతపడిన సీసీఐలో యంత్రాలు, ఇతర సామగ్రి తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. బీహార్‌కు చెందిన కార్మికులు గ్యాస్ కట్టర్లతో పాత సామగ్రిని తీసివేస్తున్నారు. జేసీబీలతో చెట్లు తొలగిస్తున్నారు. దీంతో పరిశ్రమను తిరిగి ప్రారంభించే అవకాశాలు లేనట్లేనని స్పష్టమైంది.
పునః ప్రారంభానికి అవకాశాలు ఉన్నా..
హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి 44 పైన మూతపడిన సిమెంట్ పరిశ్రమ ఉంది. సిమెంట్‌ను తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, రోడ్డు మార్గం ఉంది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్తుతో పాటు నీటి వనరులు సైతం పుష్కలంగా ఉన్నాయి. సిమెంట్ తయారీకి అపారమైన వనరులు ఉన్నా పరిశ్రమను విక్రయానికి పెట్టడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్గంగారాంతో పాటు ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నిరుడు డిసెంబర్ మొదటివారంలో జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సీసీఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు హామీలను పక్కనపెట్టి భూముల అమ్మకాలకు శ్రీకారం చుట్టాయి.
పరిశ్రమ ప్రారంభానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు..
మూతపడిన సీసీఐ యంత్రసామగ్రిని స్క్రాప్ కింద వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో టెండర్లను ఆహ్వానించింది. ‘ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి.. సీసీఐని ప్రారంభిస్తే 6 వేల మందికి ఉపాధి లభిస్తుంది.. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలి’ అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. అప్పటి మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేను కేటీఆర్ కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందించలేదు.
సీసీఐ భూములు కార్పొరేట్ సంస్థలకా.. విమానాశ్రయానికా!
వందల ఎకరాల సీసీఐ భూములను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు విక్రయించే చర్యలు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతున్నది. కేంద్రప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయులకు ఖనిజ సంపద ఉన్న భూములను కట్టపెట్టి వారిచేత పరిశ్రమను ప్రారంభించేలా ఒప్పందం కుదుర్చున్నారనే ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్‌లో రక్షణశాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం నిర్మించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకు 1,700 ఎకరాల భూమి అవసరమని, సీసీఐ భూములను సైతం తీసుకునే అవకాశాలున్నట్టు ఇటీవల సర్వేకు వచ్చిన అధికారులు తెలిపారు. సీసీఐకి భూములు ఇచ్చిన రైతులు మాత్రం రక్షణశాఖ ఎయిర్‌పోర్టుకు భూములు ఇవ్వొద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని కోరుతున్నారు.
సీసీఐని ప్రారంభించడంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
ఆదిలాబాద్‌లో సీసీఐని ఏర్పాటు చేయడంలో అప్పటి నాయకులు విశేష కృషిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన నాయకులు సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి కృషి చేయడంలేదు. వేలాదిమందికి ఉపాధి కల్పించే సీసీఐ ప్రారంభం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు భూములు విక్రయించే అవకాశాలు లేకపోలేదు. విమానాశ్రయం ఏర్పాటు కోసం రక్షణశాఖ ఆధ్వర్యంలో సీసీఐ భూములు ఇస్తే ఆందోళనలు చేపడుతాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
– కస్తాల అరుణ్, భూ నిర్వాసితుడు