జగిత్యాల, మే 9: పదేండ్ల తర్వాత గల్ఫ్ నుంచి ఇంటికొచ్చానన్న ఆనందం.. ఆ తండ్రికి, ఆ కుటుంబానికి ఎంతోసేపు నిలువలేదు. తండ్రి రాగానే.. తాగడానికి నీళ్ళు తెస్తానని బయటకెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మినగర్కు చెందిన చెట్పల్లి మోహన్, పద్మిని కొడుకు శివకార్తీక్(12) ఐదో తరగతి చదువుతున్నాడు.
తండ్రి మోహన్ ఉపాధి కోసం పదేండ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. సోమవారం ఉదయం ఆయన తిరిగి రావడంతో కుటుంబసభ్యులు సంతోషంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి సాయంత్రం తీసుకొచ్చారు. ఇంట్లో తాగడానికి నీళ్లు లేవని, తాను తీసుకొస్తానని శివకార్తీక్ బైక్పై వెళ్లాడు. బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివకార్తీక్ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.