హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రారంభించిన జనగణన-2027లో స్వీయ గణన పోర్టల్లో ముస్లిం వర్గాలకు చెందిన కులాల పేర్లను చేర్చాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రజలందరూ స్వీయ గణనలో భాగస్వాములై తమ వివరాలను మొబైల్ ద్వారా http://se.census.gov.in పోర్టల్లో నమోదు చేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ పోర్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల సమాచారం మాత్రమే పొందుపర్చడం వల్ల రాష్ట్రంలోని 44,57,012 మంది ముస్లింలు జనరల్ విభాగంలో తమ కులాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్వీయ గణన పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని కోరారు.