ఇప్పటికే సెస్సుల పేరిట రూ.65 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ.120కి పెంచారు. సిలిండర్ల ధర పెరిగితే పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు దుర్భరంగా మారే ప్రమాదం ఉన్నది. వెంటనే కేంద్రం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలను తగ్గించాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తం.
-కేటీఆర్
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్‌బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండున్నరేండ్ల పాలనలో కూల్చుడు, పేల్చుడు, హామీల ఎగవేతలు తప్ప చేసిందేమీలేదని మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన తెల్లారే పెట్రో ధరలు పెంచడం అలవాటైన ప్రధాని మోదీ.. 80 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూలేనిధంగా వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచి హోటళ్ల కార్మికులకు మేడే కానుకిచ్చారని ఎద్దేవాచేశారు. రూ.2,221గా ఉన్న ధర రూ.3,315కు పెరుగడంతో సామాన్యులపై పెనుభారం పడుతుందని, కార్మికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. హోటళ్లు, మెస్‌లపై ఆధారపడి జీవిస్తున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఐదు కేజీల సిలిండర్ల ధర రూ.261 పెంచడం శోచనీయమని పేర్కొన్నారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంటే, గ్యాస్, పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పెరిగిన ధరలతో ఆ పకోడీలు వేసుకొనే పరిస్థితిలేకుండా పోయిందని అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మే డే వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్మికులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌తో కలిసి కార్మిక జెండాను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే సెస్సుల పేరిట రూ.65 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ.120కి పెంచారని, ఇక సిలిండర్ల ధర పెరిగితే పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు దుర్భరంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కార్మిక పక్షపాతి కేసీఆర్
పదేండ్ల పాలనలో విప్లవాత్మక విధానాలు, పథకాలు తెచ్చి కేసీఆర్ కార్మిక పక్షపాతిగా నిలిచారని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రస్థానంలో రాళ్లెత్తిన కూలీలు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పారు. ఉద్యమ ఉధృతిలో, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తమ వెంట నడిచారని గుర్తుచేశారు. ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కలిసిరావాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ సంపద పెంచి రాష్ర్టాన్ని దేశాన్ని ఆదర్శంగా నిలుపడంలో భాగస్వాములైన కార్మిక సోదరులకు నమసరిస్తున్నామని చెప్పారు. శ్రమజీవుల విలువను గుర్తించి ‘సఫాయన్నా.. నీకు సలామ్ అన్నా..’ అని నినదించిన దేశంలోనే ఒకేఒక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. మాటలతో సరిపెట్టకుండా చేతల్లోనూ చూపారని, జీహెచ్ఎంసీ కార్మికులు అడుగకున్నా వేతనాలు పెంచిన ఘనత ఆయనకే దకిందని చెప్పారు. కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని విమర్శించారు. మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి కార్మికుల బాగోగులు మరచిపోయారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో వారందిస్తున్న విలువైన సేవలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రమను గౌరవించే సీఎంకు, గుర్తించని సీఎంకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కరోనా కాలంలో ఇతర రాష్ర్టాల కార్మికులను సైతం కడుపులో పెట్టి చూసుకున్న ఘనత కేసీఆర్‌కే దకిందని చెప్పారు. వందల కిలోమీటర్ల దూరంలోని సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డ శ్రమజీవులకు అండగా నిలిచి రూ.వెయ్యి చేతిలోపెట్టి, వారి కడుపునింపి, సీఎస్, డీజీపీని రైల్వేస్టేషన్లకు పంపి సాగనంపిన దేశంలోనే అప్పటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రైవేట్ టీచర్లను సైతం ఆదుకున్నామని గుర్తుచేశారు.

వలసజీవుల ఇండ్లపైకి బుల్డోజర్లు
హామీలు నెరవేర్చకుండా తెలంగాణ కార్మికులను అరిగోస పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వలస జీవుల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపుతూ పగ సాధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 20, 30 గజాల్లో గుడిసో, రేకుల షెడ్డో వేసుకొంటే హైడ్రా పేరిట బుల్డోజర్లు పంపి విధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం చిన్నపిల్లల పుస్తకాలు, బాటిళ్లు కూడా తీసుకోకుండా రోడ్డున పడేసిన దృశ్యాలను తెలంగాణ సమాజం మొత్తం చూసిందని చెప్పారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు తప్ప సాధించిందేమీలేదని విరుచుకుపడ్డారు. ‘కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేయడంతోపాటు వృద్ధులకు రూ.నాలుగువేల పింఛన్, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం, అత్తలకు నాలుగువేలు, కోడళ్లకు రెండున్నర వేలు..’ ఇలా 420 హామీలను ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దకిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇచ్చే వాళ్లు కారని, మహిళల మెడలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకుపోయేవాళ్లని విమర్శించారు. ఆశ వరర్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని ఆశలు కల్పించి దగా చేశారని దుయ్యబట్టారు.
‘హామీలేమయ్యాయని అడిగితే ముఖ్యమంత్రి చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నరు. ఎంత కండలు తిరిగే వస్తాదైనా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తరా? అని అంటున్నరు. మరీ 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఈ ముఖ్యమంత్రి.. నిన్ను ఏమనాలి? 100 రోజుల్లో అమలుచేస్తామని జేమ్స్‌బాండ్ లెక బాండ్ పేపర్లు ఎందుకు రాసిచ్చారు? భద్రంగా పెట్టుకొమ్మని ఫోజులు కొట్టిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార ఇప్పుడు ఎకడికి పోయిన్రు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందని, ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్లా తయారైందని, ఢిల్లీకి వెళ్తే అప్పు పుట్టడంలేదని, చెప్పులెత్తుకొనిపోయే వాడిలా చూస్తున్నారని, సెక్రటేరియట్లో లంకెబిందెలు లేవని మాట్లాడుతూ తెలంగాణ పరువుతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ లాంటి ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, కానీ ఇలా రాష్ట్ర ఇజ్జత్ తీసిన సీఎంను రేవంత్‌రెడ్డి రూపంలో చూడటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని పేర్కొన్నారు.
ఎర్రజెండా పార్టీల కంటే ఎకువే చేసినం
ఎర్రజెండా పార్టీలు అధికారంలో ఉన్న త్రిపుర, కేరళ కంటే కూడా కేసీఆర్ హయాంలో కార్మికుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ధోబీఘాట్లు, సెలూన్లకు రూ.250 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇచ్చామని గుర్తుచేశారు. 4.5 లక్షల మంది బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్ అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, కానీ ఎకడా కూడా రూ.2వేల పింఛన్ ఇవ్వడంలేదని చెప్పారు. సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచామని గుర్తుచేశారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన పాపం కాంగ్రెస్‌దేనని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తిరిగి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొనే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టి, ఇందిరమ్మ చీరల పేరిట టెసోకు ఆర్డర్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలోని 9 లక్షల 37 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు రెండు విడతల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. రూ.1,500 వేతనం ఉన్న ఆశ కార్యకర్తలకు రూ.18 వేలు చేశారని తెలిపారు. కానీ, ప్రస్తుత సీఎం మాత్రం వేతనపెంపు హామీ ఏమైందంటే, తనను కోసుకతిన్నా పైసల్లేవని అంటున్నారని.. కోసుకతినేందుకు ఆయనేమైనా దోసకాయనా? మామిడికాయనా? పుచ్చిపోయిన పుచ్చకాయన? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అప్పులు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బుకాయించడం దుర్మార్గమని మండిపడ్డారు ‘కేసీఆర్ రూ.2.8 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక గొప్ప సెక్రటేరియట్ కట్టారు. ప్రపంచమే అబ్బురపడేలా కాశేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. ఉద్యోగుల వేతనాలు పెంచారు. 33 జిల్లాలు చేశారు. 32 మెడికల్ కాలేజీలు కట్టారు. ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చారు. కలెక్టర్లు, ఎస్పీలను ప్రజలకు చేరువచేశారు. కొత్త రాష్ట్రాన్ని పట్టాలెకించి, సకదిద్ది కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పజెప్పారు’ అని కేటీఆర్ వివరించారు. కాగా, తెలంగాణభవన్‌లో నిర్వహించిన మేడే వేడుకలకు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆటోడ్రైవర్లు ఆటోలతో ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ కార్మికులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు.
కేటీఆర్ స్ఫూర్తితో 5 లక్షల బీమా
కార్మిక దినోత్సవం సందర్భంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమాలి శ్రీనివాస్ ఉదారత చాటుకొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న ప్రమాద బీమాను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంతో డ్రైవర్ల కుటుంబాలు ఎదురొంటున్న ఇబ్బందులను గమనించిన కేటీఆర్.. సిరిసిల్లలో ప్రతి డ్రైవర్‌కు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల ప్రమాద బీమా చేయించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి నియోజకవర్గంలో కార్మికులకు అండగా ఉండాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపును అమాలి శ్రీనివాస్ ఆదర్శంగా తీసుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ శక్తినగర్ డివిజన్ పరిధిలో ఉన్న క్యాబ్, ఆటో, ట్రాలీ, డీసీఎం డ్రైవర్లకు అమాలి శ్రీనివాస్ తన సొంత నిధులతో బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. మొదటి విడతగా.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్‌రెడ్డి చేతుల మీదుగా బీమా పత్రాలు అందజేశారు. తాజాగా రెండో విడతలో భాగంగా మరో 183 మందికి బీమా వర్తింపజేశారు. ఇందులో ఐదుగురు లబ్ధిదారులకు శుక్రవారం స్వయంగా కేటీఆర్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు.
నాడు కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు కట్టినం
కరోనా టైమ్‌ను సద్వినియోగం చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేరొన్నారు. నాడు లేబర్ క్యాంపులకు వెళ్లి బతిమిలాడి, దండంపెట్టి హైదరాబాద్‌లో మూడు నెలల్లోనే కొత్తరోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. కార్మికుల చెమట చుకలతోనే ఈ ఘనత సాధ్యమైందని స్పష్టంచేశారు. తెలంగాణకు కోహినూర్ వజ్రం లాంటి హైదరాబాద్‌పై ప్రేమతోనే మున్సిపల్ మంత్రిగా ఎంతో కష్టపడ్డామని గుర్తుచేశారు. ‘నాడు కేసీఆర్ సరార్ పొరుగు రాష్ట్రాల కార్మికులను కడుపులో పెట్టి చూసుకున్నది. కానీ, రేవంత్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ కుప్పకూలి మరణించిన ఎనిమిది మంది కూలీలను సైతం గుర్తించలేని దుస్థితిలో ఉన్నది. సంగారెడ్డి జిల్లా సిగాచి ఘటనలో 47 మంది కార్మికులను పొట్టనబెట్టుకొన్నది. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇస్తామని ఢోకా చేసింది’ అని విమర్శించారు.
బూతులు తిట్టుడు.. శాపాలు పెట్టుడు..
హామీల అమల్లో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డికి మైక్ దొరికితే చాలు కేసీఆర్‌ను బూతులు తిట్టడం, శాపాలు పెట్టడం అలవాటుగా మారిందని కేటీఆర్ విమర్శించారు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అడ్డమైన పనులు చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజలకు ఎప్పుడో విశ్వాసం పోయిందని చెప్పారు. ఏటా రూ.12 వేలు ఇస్తానని, వెల్ఫేర్‌బోర్డు పెడుతానని రాష్ట్రంలోని ఆరు లక్షల మం ది ఆటోవాలాలను నమ్మించి నట్టేటా ముంచారని మండిపడ్డారు. ‘నేను ఐదారు నెలల క్రితం మస్రత్ అలీ ఆటోఎకిన.. ఆటో ఎట్ల నడుస్తుందని అడిగిన.. ఆయన సార్.. ఏమున్నది సార్.. అంతా బర్బాద్ అయింది.. గతంలో రోజుకు 2 నుంచి 3 వేలు సంపాదించేటోడిని. ఇప్పుడు ఐదారు వందలు కూడా వస్తలేవు అన్నడు’ అని కేటీఆర్ వివరించారు. ఇప్పటికైనా ఆటోవాలాలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రస్థానంలో రాళ్లెత్తిన కూలీలు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటాం. పదేండ్ల పాలనలో విప్లవాత్మక విధానాలు, పథకాలు తెచ్చి కేసీఆర్ కార్మిక పక్షపాతిగా నిలిచారు. కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి కార్మికుల బాగోగులు మరచిపోయారు. -కేటీఆర్
ఎర్రజెండా పార్టీలు అధికారంలో ఉన్న త్రిపుర,కేరళ కంటే కూడా కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. 27 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌బోర్డు, ప్రమాదబీమా, వివాహ కానుక, ప్రసూతి కానుక, కేసీఆర్ కిట్ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.
-కేటీఆర్