Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా 27 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలుల కారణంగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నదని పేర్కొంది.
ఈనెల 29వరకు దేశవ్యాప్తంగా ఈ వడగాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. మరోవైపు పలు ప్రాంతాల్లో శనివారం వానలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నిర్మల్, నిజామాబాద్ 45.4, జగిత్యాల 45.3, ఆదిలాబాద్ 45.2, మంచిర్యాల 45.1, కుమ్రం భీం ఆసిఫాబాద్ 45.0, జోగులాంబ గద్వాల, నల్లగొండ 44.9, కామారెడ్డి 44.6, పెద్దపల్లి 44.5 డిగ్రీలుగా నమోదయ్యాయి.