హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఏప్రిల్, మే, జూన్లో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. కొన్ని ప్రాంతాల్లో 48, 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది.