హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఎండలు మంట పుట్టిస్తున్నాయి. రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఇంటినుంచి అడుగు బయటపెట్టాలంటే జంకేలా చేస్తున్నాయి. బుధవారం హైదరాబాద్, వరంగల్ మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి.
అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా చుంచుపల్లి మండలం గిరిమెల్లపాడులో 43.2 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 43.1 డిగ్రీలు, కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని 20 ప్రాంతాల్లో 42.4 డిగ్రీల నుంచి 43.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీల నుంచి 43.3 డిగ్రీల మధ్య నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. మెదక్ జిల్లా చిప్పలతుర్తిలో 18.3 డిగ్రీలు నమోదుకాగా, హైదరాబాద్‌లో 26.6 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో తక్కువఎత్తులో ఉత్తరదిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల చాలాచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్లగొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న హెచ్చరించారు. ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతేగానీ బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు, ఎండలతో హైదరాబాద్‌లో ఉక్కపోత పెరిగింది. బుధవారం నగరంలో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు పెరిగి వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పగలు ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. వారం కిందట 38 డిగ్రీలు ఉన్న ఎండలు.. బుధవారం 43 డిగ్రీలకుపైగా చేరాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రుద్రంపూర్ సింగరేణి ఏరియాల్లో ఎండలు మండుతున్నాయి.
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రూరల్ మండలపరిధిలోని కరుణగిరి వద్ద ఓ కారు దగ్ధమైంది. ఖమ్మం నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న కారులో ఎండ వేడిమికి షార్ట్‌సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దిగగానే.. కారులో మంటలు చెలరేగాయి.