Hyderabad |హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఏడాదికిపైగా కునారిల్లుతున్న హైదరాబాద్ మహానగర రియల్ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమీషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది రియల్ మధ్యవర్తులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధన లక్షలాది ప్లాట్ల యజమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. నగరంలో ప్లాట్ల యజమానుల పరిస్థితి పెనం మీద ఉంటే తాజా నిబంధనతో పొయ్యిలో పడినట్లయిందని అంద రూ వాపోతున్నారు. ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో సైతం గతంలో నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్వోసీ) ఇచ్చి హైడ్రా కూల్చివేతల సందర్భంగా తూచ్… అన్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల చుట్టూ తిరిగి మళ్లీ ఎన్వోసీలు తీసుకురావాలనే షరతు ప్లాట్ల యజమానుల్లో దడ పుట్టిస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో లోటు ఖజానాను నింపుకొనేందుకు కాం గ్రెస్ సర్కారు చేస్తున్న ఎల్ఆర్ఎస్ హడావుడి దరఖాస్తుదారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. అక్రమమో… సక్రమమో.. తర్వాత తేలుస్తాం! ముందైతే 25 శాతం రిబేటుతో ఓపెన్ స్పేస్ చార్జీలు (ఎల్ఆర్ఎస్ ఫీజు) చెల్లించాలంటూ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో మడత పేచీ పెట్టింది. సంబంధిత నీటివనరు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) అనేది రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల్లో ఉంటుంది. దీనికి అదనంగా నీటివనరు విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్‌జోన్ అనేది గరిష్ఠంగా 30 మీటర్లు (98.42 ఫీట్లు) ఉంటుంది. నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 50 మీటర్లు (164.04 ఫీట్లు) ఉంది. రెండురోజుల కిందట ప్రభుత్వం జారీచేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. నీటివనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్లు (656.16 ఫీట్లు) వరకు ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జఠిలంగా మార్చ డం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఆ ప్లాట్లపై అనవసరపు మచ్చ
సాధారణంగా రియల్ రంగంలో లావాదేవీల ప్రక్రియ అతి సున్నితంగా ఉంటుంది. ఒక ప్లాటు వివాదంలో ఉందని నోటి మాటగా ఎవరైనా అన్నా… కొనుగోలు చేసేవారు రిస్క్ ఎందుకని వెనుకడుగు వేస్తారు. ఎవరైనా ముందుకొచ్చినా బహిరంగ మార్కెట్లో ధర కంటే తక్కువకు వస్తుందని చూస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద చెరువైనా గరిష్ఠంగా బఫర్‌జోన్ 30 మీటర్లు ఉన్నందున దానికి సమీపంలో ఐదారు మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు కాస్త రిస్క్ ఉండే అవకాశముంది. ప్రభుత్వం రెండు రోజుల కిందట ఇచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో 200 మీటర్లుగా ప్రకటించింది. నిబంధనల కంటే పరిధిని ఏడు రెట్ల కు పెంచింది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేని ప్లాట్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదు.. పరిశీలన తర్వాత క్రమబద్ధీకరిస్తాం.. అని అధికారులు సర్దిచెప్పుకోవచ్చు. అసలు ప్రభుత్వం 200 మీటర్ల నిబంధన ఎందుకు పెట్టింది? ఏ ప్రాతిపదికన దీనిని నిర్ధారణకు తీసుకుంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో నీటివనరుల చుట్టూ పావు కిలోమీటరు వరకు ఉన్న ప్లాట్ల భవితవ్యం గందరగోళంలో పడింది. భవిష్యత్తులో వాటికి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ రావచ్చు.. కాకపోతే తాత్కాలికంగా ఈ నిబంధన పెట్టడం వల్ల ప్రజల్లో లేని అనుమానాలను కల్పించడంతో పాటు ఆ ప్లాట్లపై పరోక్షంగా ఓ ముద్ర వేసినట్లయిందని ఓ రియల్ వ్యాపారి వాపోయారు. చెరువులు, కుంటల చుట్టూ పావు కిలోమీటరు దూరం వరకు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేయాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి, తద్వారా రియల్ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్వోసీకి ఎన్ని తిప్పలో
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో చెరువులు, కుంటల చుట్టూ 200 మీటర్ల పరిధిలోకి వచ్చే ప్లాట్లన్నింటినీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిశీలన తర్వాతనే క్రమబద్ధీకరించనున్నట్టు స్పష్టం చేసింది. గతంలోనూ ఇరిగేషన్ శాఖ నుంచి పుట్టగొడుగుల్లా ఎన్వోసీలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా నిర్మించుకున్న నివాసాలను హైడ్రా కూల్చివేసిన ఘటనలు కండ్లముందే జరిగాయి. ఎన్వోసీలు జారీచేసిన ఇంజినీర్లపైనా చర్యలకు హైడ్రా సిఫారసు చేసింది. కత్వా చెరువు పరిధిలోని కూల్చివేతల సమయంలో గతంలో ఎన్వోసీలు జారీచేసిన ఇంజినీర్లే తిరిగి ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్నాయంటూ మార్కింగ్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 200 మీటర్ల పరిధిలో ఉన్న వారంతా రెండు శాఖల నుంచి ఎన్వోసీలు పొందాలని చెప్పడంతో లక్షలాది ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. రెండు శాఖల్లోనూ సిబ్బంది కొరత ఉండటంతో ‘డిమాండు’ కూడా పెరగనుందనేది బహిరంగ రహస్యం.
జీవో 168 ప్రకారం పరిధులు ఇలా…
1998 నుంచి 2011 వరకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనలకు ఇచ్చిన 19 జీవోలను మేళవించి 2012 ఏప్రిల్ 7న జీవో నంబర్ 168 జారీచేశారు. దీని ప్రకారం రిక్రియేషన్, గ్రీన్, బఫర్జోన్లు అమలులో ఉంటున్నందున నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు.
ఆ మేరకు ఆయా జోన్ల పరిధి…