1000 కోట్ల మాస్ పెట్టుబడి

- అమెరికా తర్వాత ఇక్కడే తొలి కేంద్రం
- యూఎస్ బీమారంగ దిగ్గజ సంస్థ సంసిద్ధత
- ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
- ఇప్పటికే 300మంది ఉద్యోగుల నియామకం
- ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి
- ప్రపంచంలోనే హైదరాబాద్ ‘ది బెస్ట్' అనిపించింది
- టాలెంట్‌పూల్, ప్రభుత్వ విధానాలు ఆకర్షించాయి
- మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల
- హైదరాబాద్‌లో మాస్ మ్యూచువల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ, బీమారంగ దిగ్గజం, అమెరికాకు చెందిన ‘మాస్ మ్యూచువల్' హైదరాబాద్‌లో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫార్చ్యూన్-500లో స్థానం పొందిన ఈ సంస్థ అమెరికా వెలుపల తమ మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనుండటం విశేషం. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో త్వరలో 1.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో తన కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీనిద్వారా అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజినీరింగ్ డాటా సైన్స్, డాటా ఎనలిటిక్స్ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ సంస్థ ఇప్పటికే 300మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నది. పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాస్ మ్యూచువల్ సంస్థ ప్రతినిధులతో చర్చించిన అనంతరం మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ కోసం ఆ సంస్థ 300మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నదని చెప్పారు. భవిష్యత్తులోనూ మరింతమంది ఉద్యోగులను నియమించుకునే అవకాశమున్నదని తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చల సందర్భంగా ప్రభుత్వం తరఫున వారికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడులకోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నాయని, తాజాగా, 170 సంవత్సరాల చరిత్ర కలిగిన మాస్ మ్యూచువల్ సంస్థ తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషమని చెప్పారు. సదరు సంస్థ అమెరికా వెలుపల తమ మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గమనార్హమని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలను బట్టి హైదరాబాద్ ఎంపిక
మాస్ మ్యూచువల్ సంస్థ(ఇండియా) హెడ్ రవి తంగిరాల మాట్లాడుతూ, తమ కంపెనీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని చెప్పారు. అయితే ఇక్కడ నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయ ని, అందువల్లనే హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నామని తెలిపారు. తమ కంపెనీ 1851లో ఏర్పాటై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆర్థిక సేవలను అందిస్తున్నదని, రానున్న రోజుల్లో ఇతర రంగాలకు కూడా తమ సేవలను విస్తరించేందుకుప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజినీరింగ్ డాటా సైన్స్, డాటా ఎనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో కంపెనీ కోర్ టెక్నాలజీ హెడ్ ఆర్థర్ రీల్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ పెట్టుబడులకోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. తాజాగా 170 సంవత్సరాల చరిత్ర కలిగిన మాస్ మ్యూచువల్ సంస్థ తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషం. మాస్ సంస్థ అమెరికా వెలుపల తమ మొదటి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గమనార్హం. దీన్నిబట్టి ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్న విషయం మరోసారి నిరూపితమైంది.
-మంత్రి కేటీఆర్
తాజావార్తలు
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు
- రానా- మిహికా బంధానికి తీపి గుర్తు
- సరికొత్త రికార్డ్.. కోటి దాటిన కరోనా టెస్టులు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్