హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు (Maoists ) నాయకులు, కేడర్ ఇప్పటికైనా ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతి, కుటుంబాలతో కలసి ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ( DGP Shivadar Reddy ) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. మావోయిస్టుల్లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు జన జీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించి, శాంతి మార్గాన్ని ఎంచుకునేలా చైతన్య పరచాలని కోరారు.
జన జీవన స్రవంతిలో కలిసే వారందరికీ భద్రత, గౌరవం, కొత్త జీవితానికి అవసరమైన అన్ని సహాయాలను అందించడంలో తెలంగాణ పోలీసులు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతిలో భాగస్వాములు కావాలని తెలంగాణకు చెందిన, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు నిర్మాణాల్లో పనిచేస్తున్న అజ్ఞాత కేడర్‌కు సూచించారు.
ముప్పాల్ల లక్ష్మణరావు అలియస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్న బాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి అజ్ఞాతంలో ఉన్నారని వివరించారు. గత రెండు సంవత్సరాలలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని , వీరికి సమగ్ర పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం, ప్రయోజనాలు అందజేశామని వెల్లడించారు.