మెదక్, మే 15(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు. వరుస చోరీలతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
గ్రామానికి చెందిన రాయిని రాములు ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు వంద తులాలకు పైగా బంగారు నగలు, ఒక కిలో వెండి వస్తువులను దొంగిలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే ఏసిరెడ్డి మాణిక్‌రెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారం అపహరించారు.ఇక జగ్గు చిన్న మల్లారెడ్డి ఇంట్లో మూడు మసాల బంగారం, జగ్గు అరుంధతి ఇంట్లో కమ్మలు, పట్టగొలుసును దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్రలేచి చూసిన కుటుంబ సభ్యులు ఇళ్ల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అల్లదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఒకే రాత్రిలో నాలుగు ఇండ్లలో చోరీలు జరగడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రాత్రి పహారా పెంచాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.